Saturday, January 11, 2025
Homeజాతీయంస‌మాజంలో ఏ మ‌తం కాలుష్యాన్ని ప్రోత్సాహించ‌దు

స‌మాజంలో ఏ మ‌తం కాలుష్యాన్ని ప్రోత్సాహించ‌దు

Date:

స‌మాజంలో ఏ మతమూ కాలుష్యాన్ని ప్రోత్సహించదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. టపాసులు అమ్మకాలు, వాటిని కాల్చడాన్ని అరికట్టేందుకు ఢిల్లీ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ”కాలుష్యాన్ని సృష్టించే చర్యలను ఏ మతమూ ప్రోత్సహించదు. ఇదే తరహాలో టపాసులు పేలిస్తే.. ఆరోగ్యంగా జీవించేందుకు పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కును ఉల్లఘించినట్టే అవుతుంది” అని కోర్టు తీవ్రంగా స్పందించింది. నవంబరు 25లోగా వ్యాపార వర్గాలను సంప్రదించి శాశ్వతంగా బాణసంచాను నిషేధించే విషయంపై దిల్లీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాలని సూచించింది. నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ఓ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రా మెటీరియల్ మాత్రమే సీజ్‌ చేసి కంటి తుడుపు చర్యలకు పాల్పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది.

దీపావళి తర్వాత దిల్లీలో కాలుష్యం పెరగడంపై గత విచారణలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ”టపాసులపై నిషేధం అమలు చేయలేదని వార్తలు వచ్చాయి. కాలుష్యాన్ని నివారించడానికి నిషేధాన్ని ముఖ్యమైన చర్యగా భావించాం. అసలు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు” అంటూ దిల్లీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. నిషేధాన్ని ఉల్లంఘించే వారి స్థలాలను సీల్‌ చేయడం వంటి కఠిన చర్యలు అవసరమని వ్యాఖ్యానించింది. 2025 నాటి దీపావళికైనా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నంకాకుండా చర్యలు ఉండాలని సూచించింది. శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని రాజధాని నగరంలో కాలుష్య నియంత్రణే లక్ష్యంగా బాణసంచా తయారీ, విక్రయాలపై దిల్లీ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 వరకు అమలులో ఉంటుంది. బాణసంచా ఆన్‌లైన్‌లో విక్రయం, డెలివరీలకూ ఈ నిషేధం వర్తిస్తుందని సెప్టెంబర్‌లోని ప్రభుత్వం పేర్కొన్నా.. టపాసుల మోత మాత్రం ఆగలేదు.