Saturday, September 21, 2024
HomeUncategorizedఇళ్లు కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

ఇళ్లు కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

Date:

అధికారులకు ఇళ్లు కూల్చివేత ఒక ఫ్యాషన్‌గా మారిందని, బాధిత మహిళకు నష్ట పరిహారం ఇవ్వాలని అధికారులను మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘటన బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఉజ్జయినీకి చెందిన రాధా లాంగ్రీ అనే మహిళ ఇంటిని అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ మున్సిపల్‌ అధికారులు కూల్చివేశారు. దీనిపై ఆమె మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన ఇండోర్ బెంచ్‌ను ఆశ్రయించింది. అధికారులు తప్పుగా తన ఇంటిని కూల్చివేశారని ఆరోపించింది.

న్యాయమూర్తి వివేక్ రుషియా నేతృత్వంలోని ధర్మాసనం ఆ మహిళ పిటిషన్‌పై విచారణ జరిపింది. విధి విధానాలు పాటించకుండా ఏ ఇంటినైనా కూల్చివేయడం స్థానిక పరిపాలన, స్థానిక సంస్థల అధికారులకు ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిందని విమర్శించింది. క్రమబద్ధీకరించడానికి సరైన అవకాశం ఇచ్చిన తర్వాతే కూల్చివేతను చివరి మార్గంగా ఎంచుకోవాలని సూచించింది. మరోవైపు సరైన అనుమతి లేకుండా లేదా నిబంధనలు పాటించకుండా ఇల్లు నిర్మించుకునే హక్కు ఎవరికీ లేదని హైకోర్టు పేర్కొంది. ఆ ఆస్తికి సంబంధించి నకిలీ పత్రాలు తయారు చేసిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అలాగే బాధిత మహిళకు లక్ష నష్టపరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది.