దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. కాలుష్యం పెరిగిపోతుండటంతో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించిపోతోంది. సోమవారం రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత అధ్వానస్థితికి చేరింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్క్‌ను దాటేసింది. ఏక్యూఐ 400 దాటితే అది ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. సోమవారం ఉదయం 7 గంటల సమయంలో ఆనంద్ విహార్‌లో 433, వజీర్‌పూర్‌లో 414, జహంగీర్‌పురిలో 413, రోహిణి ప్రాంతంలో 409, పంజాబీ బాగ్‌లో 404గా గాలి నాణ్యత నమోదైంది. పలు ప్రాంతాల్లో 400 కంటే ఎక్కువ స్థాయిల్లో ఏక్యూఐ నమోదైనట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది.
ఆగ్రా, నోయిడాతోపాటు ఢిల్లీ ఎన్సీఆర్లో దట్టంగా పొగ కమ్ముకున్నది. కాలుష్యం ధాటికి తాజ్‌మహల్ కనిపించకుండా పోయింది. గత 10 నుంచి 12 రోజుల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇక యమునా నది నురగలు కక్కుతున్నది. పెద్దమొత్తంలో నురగ నదిపై ప్రవహిస్తున్నది. కాగా రానున్న మూడు రోజుల్లో రాజధాని పొగ మంచు కమ్మేసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. గాలి వేగం గంటకు 10 కిమీ కంటే తక్కువగా ఉంటుందని.. ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.