కులగణనను బాధ్యతగా పనిచేయాలని కష్టానికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుందని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సోనియాగాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టి తీరుతామని స్పష్టం చేశారు. కులగణనపై గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న సీఎం.. ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. కుల గణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు 33 మంది ప్రత్యేక అబ్జర్వర్లను నియమించాలని రేవంత్ రెడ్డి సూచించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అమలు చేసే క్రమంలో ఎవరు అభ్యంతరకరంగా వ్యవహరించినా పార్టీ క్షమించదని హెచ్చరించారు. నవంబర్ 31లోగా ప్రక్రియ పూర్తి చేసి భవిష్యత్తు యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచి నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించాల్సి ఉందని స్పష్టం చేశారు. కులగణన ఎక్స్‌రే మాత్రమే కాదని అది మెగా హెల్త్ చెకప్ లాంటిదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో మన తెలంగాణను మోడల్ గా పరిగణనలోకి తీసుకునేలా డాక్యుమెంటును కేంద్రానికి పంపుతామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నది బీసీ కులగణన కాదు.. సమగ్ర కులగణన అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.