Thursday, November 21, 2024
Homeఇంటర్యూ57ఏళ్ల వ‌య‌స్సులో పిహెచ్‌డీ

57ఏళ్ల వ‌య‌స్సులో పిహెచ్‌డీ

Date:

మ‌నిషి వ‌య‌స్సుకు, మ‌నిషి ఆలోచ‌న‌కు అస్స‌లు సంబంధ‌మే లేదు.. వ‌య‌స్సు శ‌రీరానికే కాని మ‌నిషి ఆలోచ‌న‌ల‌కు కాదు.. కొంత‌మందికి వ‌య‌స్సు పైబ‌డుతున్న కొత్త కొత్త విష‌యాలు నేర్చుకోవ‌డానికి నిరంత‌రం కృషి చేస్తూ ఉంటారు.. వేగంగా పరుగులెత్తే స‌మాజంతో పోటీ ప‌డాల‌ని త‌ప‌న పడుతుంటారు. చ‌దువుతున్న యువ‌త‌కు తామేమి త‌క్కువ కాద‌ని నిరూపించే ప్ర‌య‌త్నం చేస్తారు.. అలాంటిది తాను నమ్మిన ఆశ‌యం సాధ‌న కోసం ఓ వ్యక్తి ముంద‌డుగు వేశారు.. 57 ఏళ్ల వ‌య‌స్సులో, 15ఏళ్లు పోరాటం చేసి పీహెచ్‌డీ సాధించారు. డాక్టరేట్ పొందిన మాతంగి వీరస్వామితో ముంద‌డుగు ముచ్చ‌టించింది..

*ముంద‌డుగు ప్ర‌త్యేకం*

త‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచి అంటే 8వ త‌ర‌గ‌తి నుంచే న‌వ‌ల‌లు చ‌ద‌వ‌డం అల‌వాటు అయింది. అప్పుడే వంద‌లాది పుస్త‌కాలు, న‌వ‌ల‌లు చ‌దువుతుండేవాడిని. నా ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టుగానే నాలో అభ్యుద‌య భావాలు అల‌వాటుప‌డ్డాయి. అందుకే ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పాటలకు ఎక్కువ‌గా ఆక‌ర్షితుడ‌య్యేవాడిని. 1993లో వ‌రంగ‌ల్ రేడియోలో పాటలు రాసి పాడాను. 2000 సంవ‌త్స‌రంలో ఖైదీల‌పై కూడా పాటలు రాసి పాడేవాడిని. ఒక సినిమా కోసం కూడా పాట రాసాను. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌లో నేను రాసిన క‌విత్వాల‌కు పుర‌స్కారాలు ల‌భించాయి.. ఇప్ప‌టికి స‌మాజానికి మేల్కోలిపై పాటలు, క‌విత్వాలు రాస్తూనే ఉంటాను..

*చిన్న‌వ‌య‌స్సులోనే ప్ర‌భుత్వ ఉద్యోగం..*

మాది ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని మ‌హ‌బూబాబాద్ ప్రాంతం.. 1987లో జైళ్ల శాఖ‌లో ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌చ్చింది. మహబూబాబాద్‌, వరంగల్, ముషీరాబాద్, చర్లపల్లి, వరంగల్, చంచల్ గూడ, వరంగల్ నుంచి ప్రమోషన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వ‌ర్తించాను. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ జైలు డిఐజీ ఆఫీసులో ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాను. తాను 37సంవ‌త్స‌రాల నుంచి విధులు నిర్వ‌ర్తిస్తున్నాను. నిజాయితీగా తన ఉద్యోగం చేస్తూనే పిహెచ్ డీ కోసం కంకణం కట్టుకున్నాను.

*డా. ఎస్వీ సత్యనారాయణ రచనలపై*

నేను చ‌దివిన పుస్త‌కాల ప్ర‌భావ‌మో లేదా పెరిగిన ప్ర‌భావ‌మో తెలియ‌దు కాని అభ్యుద‌య భావాల‌కు బాగా క‌నెక్ట్ అయ్యాను. అందుకే అభ్యుద‌య క‌వి, రచయిత ఉస్మానియా యూనివర్సిటీ ప్రొపెసర్ పనిచేసిన డా. ఎస్వీ స‌త్య‌నారాయ‌ణ ర‌చ‌న‌లు న‌న్ను బాగా ఆక‌ట్టుకున్నాయి. అందుకే ఆయ‌న ర‌చ‌న‌ల‌పై పిహెచ్‌డీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఎస్వీ సత్యనారాయణ ఆలోచనలు, అనుభవాలను అర్థం చేసుకుంటూ, అతని సలహాలు, సూచనలు స్వీకరించాను. 2009లో పిహెచ్‌డీ సీటు వచ్చింది. అది పూర్త‌వ్వ‌డానికి 15సంవ‌త్స‌రాలు ప‌ట్టింది. ఉద్యోగ ప‌నులు, ఇత‌రత్రా ఎంత బిజీ పనులు ఉన్న మొత్తానికి పూర్తి చేశాను.

*జైళ్ల శాఖ పూర్తి స‌హాకారం*

నేను పిహెచ్‌డీ చేస్తాన‌ని 2001లో మా డిపార్ట్ మెంట్ నుంచి అనుమ‌తి తీసుకున్నాను. మా జైళ్ల శాఖ‌లో ఉన్నతాధికారులు ఐజీలు రాజేశ్, మురళీధర్, డిఐజీలు శ్రీనువాస్, సంపత్, చంచల్ గూడ జైలు సూపరిండెంట్ శివకుమార్ స‌హాకారం అందించారు. వీరితో పాటు రిటైర్డ్ ఐజీ సునిల్ కుమార్ అంటే ఇప్ప‌టికి ప్ర‌త్యేక అభిమానం. జైళ్ల‌శాఖ‌లో జ‌రిగే రిటైర్‌మెంట్‌, ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌కు ఇప్పటికి పాటలు రాసి పాడుతాను. మ‌నిషి ఏదైనా సాధించాల‌నే ప‌ట్టుద‌ల అత‌ని ఆలోచ‌న‌ల్లో బ‌లంగా ఉండాలి. అప్పుడే ఏదైనా సాధ్యం.. పిహెచ్‌డీ చేసి డాక్ట‌రేట్ పొందాన‌ని ఆనందం అది వ‌ర్ణించ‌లేనిది.. ఇప్ప‌టికి త‌న వంతు ప్ర‌య‌త్నంగా స‌మాజాన్ని మేల్కోలిపే రచనలు, పాటలు రాస్తూ ఉంటాను. తన ఎదుగుదలలో నా కుటుంబసభ్యుల సహకారం మాత్రం ఎన్నటికి మరిచిపోను.