Wednesday, October 30, 2024
Homeజాతీయంఅమెరికాలో అక్రమంగా ఉంటున్న భార‌తీయులు

అమెరికాలో అక్రమంగా ఉంటున్న భార‌తీయులు

Date:

అక్ర‌మ చొర‌బాటుదారుల‌పై అగ్ర‌రాజ్యం అమెరికా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అమెరికాలో అక్రమ వలసదారులను నియంత్రించాలని యూఎస్‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ హోంల్యాండ్‌ (డీహెచ్‌ఎస్‌) ప్రయత్నిస్తుంది. ఇందులోభాగంగా తమ దేశంలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపించినట్లు డీహెచ్‌ఎస్‌ పేర్కొంది. అక్టోబరు 22న ప్రత్యేక విమానంలో వీరిని భారత్‌కు పంపినట్లు తెలిపింది. భారత ప్రభుత్వ సహకారంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు అమెరికా వెల్లడించింది. ‘చట్టబద్ధత లేకుండా అమెరికాలో ఉంటున్న భారతీయ పౌరులను వెనక్కి పంపాలని నిర్ణయించుకున్నాం. వలస వచ్చిన ప్రజలు స్మగ్లర్ల చేతిలో బందీలు కాకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నాం’ అని డీహెచ్ఎస్‌ సీనియర్‌ అధికారి క్రిస్టీ ఎ.కనెగాల్లో పేర్కొన్నారు.

గత జూన్‌ నెలలో ది బోర్డర్‌ ప్రెసిడెన్షియల్‌ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. అమెరికా నైరుతి సరిహద్దుల్లో అనధికారిక వలసలు 55 శాతం తగ్గినట్లు డీహెచ్‌ఎస్ గుర్తించింది. ఈ క్రమంలోనే 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1,60,000 మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపినట్లు తెలిపింది. 495కు పైగా ప్రత్యేక విమానాల్లో 145 దేశాలకు చెందిన వలసదారులను వెనక్కి పంపింది. వీరిలో భారత్‌తో పాటు కొలంబియా, ఈక్వెడార్‌, పెరూ, ఈజిప్ట్‌, మారిటానియా, సెనెగల్‌, ఉజ్బెకిస్థాన్‌, చైనా దేశాల పౌరులు ఉన్నారు. ఈ చర్యలు కఠినమైన సరిహద్దు సమస్యలను పరిష్కరించడం, అక్రమ వలసలను నియంత్రించడంతో పాటు చట్టబద్ధమైన వలసల మార్గాలను ప్రోత్సహించేందుకేనని అమెరికా వెల్లడించింది.