Wednesday, October 30, 2024
Homeజాతీయంత‌న‌కు ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాటం కొత్తేమి కాదు

త‌న‌కు ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాటం కొత్తేమి కాదు

Date:

వ‌య‌నాడు లోక్ స‌భ ఉప ఎన్నిక నుంచి బ‌రిలో నిలిచిన కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీ వ‌య‌నాడ్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఓ భావోద్వేగభరిత పోస్ట్‌ చేశారు. ఎన్నికల్లో పోటీ కొత్తేమో గానీ.. ప్రజల తరఫున పోరాటం తనకు కొత్తేమీ కాదని అన్నారు. “కొన్ని నెలల క్రితం నేను, మా సోదరుడు రాహుల్‌తో కలిసి మండక్కై, చూరాల్‌మల వెళ్లాను. కొండచరియలు విరిగిపడటంతో ప్రకృతి సృష్టించిన బీభత్సం కారణంగా మీరు ఎదుర్కొన్న నష్టాన్ని, సర్వం కోల్పోయిన మీ ఆవేదనను కళ్లారా చూశా. పిల్లలను కోల్పోయిన తల్లులు, కుటుంబాన్ని కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను చూశా. ఆ చీకటి రోజుల నుంచి బయటపడి నవశక్తితో మీరు ముందుకు కదిలిన తీరు స్ఫూర్తిదాయకం. నిస్సహాయ స్థితిలోనూ తోటి వారి కోసం మీరు పడిన ఆరాటం.. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఆ విషాద సమయంలో మీరు చూపించిన అచంచలమైన ధైర్య సాహసాలే.. ఈరోజు నాలో స్ఫూర్తిని నింపాయి. మీ తరపున పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా”

”నా సోదరుడికి మీరు ఎంతో ప్రేమను, అభిమానాన్ని పంచారు. అదే ప్రేమను నాపైనా కురిపిస్తారని ఆశిస్తున్నా. చట్టసభలో మీ గళాన్ని వినిపించే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. చిన్నారుల భావి భవిష్యత్తు, మహిళల శ్రేయస్సు కోసం నా శక్తికి మించి కృషి చేస్తానని మాటిస్తున్నా. ప్రజాప్రతినిధిగా పోటీ చేసే ఈ ప్రయాణం నాకు కొత్త కావొచ్చు. కానీ, ప్రజల తరఫున గళం వినిపించేందుకు చేసే పోరాటం మాత్రం కొత్త కాదు. ఈ ప్రయాణంలో మీరంతా నాకు మార్గదర్శకంగా నిలుస్తారని ఆశిస్తున్నా” అని ప్రియాంకా గాంధీ రాసుకొచ్చారు.