నేను ఇంటికి వెళ్లను.. మా నాన్న రోజు తాగి వచ్చి కొడుతున్నాడని ఆరో తరగతి చదువుతున్న బాలిక కన్నీళ్లు పెట్టుకుంది. నాన్న పేరు చెపితేనే వణికిపోతుంది. ఈ దారుణ సంఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో జరిగింది. హైదరాబాద్ బాబానగర్‌కు చెందిన అక్బర్, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి చౌటుప్పల్‌లో స్థిరపడ్డారు. ఆరో తరగతి చదువుతున్న వారి కుమార్తెను పట్టణంలోని బంగారుగడ్డలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చేర్పించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అక్బర్ భార్య తన మూడేళ్ల కుమారుడిని వెంటబెట్టుకుని కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తున్నది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న అక్బర్.. భార్యపై తనకున్న కోపాన్ని కుమార్తెపై చూపిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో గురువారం బాలిక పాఠశాలకు వెళ్లలేదు.
అయితే మధ్యాహ్నం సమయంలో పాఠశాలకు వచ్చిన బాలిక, తన బాధను స్నేహితులతో చెప్పుకుని ఏడ్చింది. రాత్రి నుంచి ఏమీ తినలేదని, ఆకలిగా ఉందని చెప్పడంతో వారు విషయాన్ని టీచర్‌కు తెలిపారు. దీంతో ఆమె భోజనం పెట్టించి ఓదార్చారు. అదేసమయంలో మద్యం మత్తులో స్కూల్‌కు వచ్చిన తండ్రిని చూసిన చిన్నారి భయంతో అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది. పాఠశాల వెనక ఉన్న భవిత కేంద్రంలో దాక్కుంది. స్కూళ్లో కుమార్తె కనిపించకపోవడంతో అతడు ఉపాధ్యాయులతో గొడవకు దిగి, దాడికి యత్నించాడు. కొద్దిసేపటి తర్వాత అతడిని అక్కడి నుంచి పంపించేసి, బాలికను మండల వనరుల కేంద్రానికి తరలించారు. ఎంఈవో సమాచారం మేరకు పోలీసులు బాలికను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి బాలికను బాల సదన్‌కు తరలించారు.