ప్రతి మనిషికి హక్కులు ఉన్నాయి. మన హక్కులకు భంగం కలిగితే శిక్షించేందుకు చట్టాలు ఉన్నాయి. అలాంటిది వినియోగదారు నుంచి 50 పైసలు అదనంగా తీసుకున్న ఇండియన్ పోస్ట్‌కు వినియోగదారుల ఫోరం గట్టి షాక్ ఇచ్చింది. 50 పైసలతోపాటు నష్టపరిహారం కింద రూ.10,000; వ్యాజ్య ఖర్చుల కోసం రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది. ఫిర్యాదుదారు ఏ మానష తన ఫిర్యాదులో చేసిన ఆరోపణల ప్రకారం, ఆయన 2023 డిసెంబరు 13న పొజిచలూర్ పోస్టాఫీసులో రిజిస్టర్డ్ లెటర్ బుక్ చేశారు.
దానికి పోస్టాఫీసు ఇచ్చిన రశీదులో రూ.29.50 వసూలు చేసినట్లు తెలిపింది. కానీ ఆయన వద్ద నుంచి రూ.30 వసూలు చేసింది. తాను డిజిటల్ పేమెంట్ చేస్తానని ఆయన చెప్పినప్పటికీ, సాంకేతిక కారణాలను చూపి అధికారులు తిరస్కరించారు. దీనిపై వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పు చెప్తూ, సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా 50 పైసలును అదనంగా వసూలు చేయడం అనుచిత వ్యాపార విధానమని, ఇది సేవా లోపమేనని తెలిపింది.