కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను ప్రకటించారు. తనకు 12 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్‌లో ప్రియాంక వెల్లడించారు. అందులో రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు కాగా, స్థిరాస్తులు రూ.7.74 కోట్లుగా ప్రకటించారు. మూడు బ్యాంకు ఖాతాల్లో వివిధ మొత్తాల్లో డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ఉన్నాయన్నారు. తన భర్త వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సీఆర్‌వీ కారుతో పాటు రూ.1.15 కోట్ల విలువైన 4,400 గ్రాముల బంగారు నగలు ఉన్నాయని తెలిపారు.
న్యూ ఢిల్లీలోని మోహ్రౌలీ ప్రాంతంలో వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి, ఫామ్‌హౌస్ భవనంలో సగం వాటా ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో తన పేరిట ఓ నివాస భవనం ఉందని.. ప్రస్తుతం దాని విలువ రూ.5.63 కోట్లు అని తెలిపారు. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరంలో తన మొత్తం ఆదాయం రూ.46.39 లక్షలు తెలిపారు. అద్దెలతో పాటు బ్యాంకులు, ఇతర పెట్టుబడులపై వడ్డీ రూపంలో ఈ ఆదాయాన్ని పొందానని ఆమె వివరించారు. తనపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు ప్రియాంక తెలిపారు. ఇక తన భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల నికర విలువ సుమారుగా రూ.65.54 కోట్లు అని ప్రియాంక గాంధీ వెల్లడించారు. అందులో రూ.37.9 కోట్లకు పైగా చరాస్తులు కాగా, రూ. 27.64 కోట్లకు పైగా స్థిరాస్తులు అని పేర్కొన్నారు.