ఢిల్లీలో వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ గాజు సీసాను పగలగొట్టడంతో ఆయన చేతికి గాయమైంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024పై మంగళవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్, బిజెపి నేతలు పాల్గొన్నారు. బిజెపి ఎంపీ జగదాంబికా పాల్ అధ్యక్షతన ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ రిటైర్డ్ న్యాయమూర్తులు, న్యాయవాదుల బృందం ప్రతిపక్షాల అభిప్రాయాలను వింటుండగా విపక్ష ఎంపీలు, అధికార బిజెపి ఎంపీలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. కల్యాణ్ బెనర్జీకి బిజెపి ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయకు మధ్య వాగ్వాదం నెలకొంది. తీవ్ర ఆగ్రహానికి గురైన బెనర్జీ పక్కనే ఉన్న గాజు వాటర్ బాటిల్‌ను పగలగొట్టారు. దీంతో అతడి చేతికి గాయమయ్యింది. ఆయనకు ప్రథమ చికిత్స చేసి, ఆసుపత్రికి తీసుకెళ్లారు. బెనర్జీ ఈ విధంగా ప్రవర్తించినందుకు అతడిని పార్లమెంటరీ కమిటీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.