Saturday, September 21, 2024
HomeUncategorizedకర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీనామా

కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీనామా

Date:

కర్ణాటక రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీహెచ్ ప్రతాప్ రెడ్డి తన సర్వీసుకు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రజనీష్ గోయెల్‌కు పంపించారు. వ్యక్తిగత కారణాల వల్లే సర్వీసుల నుంచి తప్పుకోవాల్సి వచ్చినట్లు అందులో వివరించారు. ఏప్రిల్ 30వ తేదీ నాటికి తనను సర్వీసుల నుంచి రిలీవ్ చేయాలంటూ విజ్ఞప్తి చేశారు.

1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి సీహెచ్ ప్రతాప్ రెడ్డి. ఆయన స్వస్థలం గుంటూరు. ఐపీఎస్‌గా కర్ణాటక క్యాడర్‌కు అలాట్ అయ్యారు. ప్రస్తుతం అంతర్గత భద్రత విభాగం చీఫ్‌గా కొనసాగుతున్నారు. గతంలో ఉత్తర కన్నడ సహా వివిధ జిల్లాలకు ఎస్పీగా పని చేశారు. సీబీసీఐడీ చీఫ్‌, బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌గా తనదైన ముద్ర వేశారు. బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన ప్రతాప్ రెడ్డి.. ప్రొబేషన్ ముగిసిన అనంతరం హసన్ జిల్లాలోని అరసికెరె ఎఎస్పీగా బాధ్యతలను చేపట్టారు. క్రమంగా అనేక కీలక విభాగాల్లో పని చేశారు. సైబర్ సెక్యూరిటీ విభాగం డైరెక్టర్‌గానూ వ్యవహరించారు. విధి నిర్వహణలో ఆయన చూపిన ప్రతిభకు రాష్ట్రపతి, కర్ణాటక ముఖ్యమంత్రి గౌరవ పతకాలను అందుకున్నారు.

ఈ ఏడాది జూన్ చివరి వారంలో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. పదవీ విరమణ గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతాప్ రెడ్డి.. సర్వీసుకు గుడ్‌బై చెప్పడం కలకలం రేపుతోంది. దీనికి కారణాలేమిటనేది తెలియరావట్లేదు గానీ.. రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే ప్రచారం కన్నడనాట వినిపిస్తోంది. ఇంకొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఆయన సర్వీసుల నుంచి వైదొలగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయొచ్చని, అందుకే ముందుగానే సర్వీసులకు రాజీనామా చేశారని అంటున్నారు.