ఓ మహిళ భర్త దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసింది. పూజలు పూర్తైయిన కొన్ని గంటలకే భార్య భర్తకు విషమిచ్చి చంపేసింది. ఉత్తరప్రదేశ్‌లోని కౌశంబి జిల్లా ఇస్మాయిల్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం తన భర్త శైలేశ్ కుమార్(32)కు వేరే మహిళతో సంబంధం ఉందన్న అనుమానం కారణంగా సవిత అనే మహిళ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. కర్వా చౌత్ పండుగ సందర్భంగా భర్త దీర్ఘాయుష్షు కోసం ఆదివారం సవిత ఉపవాసం ఉంది. శైలేశ్ పండగ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. సాయంత్రం ఉపవాసం విరమించిన తర్వాత సవిత తన భర్తతో గొడవ పడింది. అయితే ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగినట్టు కనిపించింది. దంపతులిద్దరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత భర్తను పక్కింటికి వెళ్లి ఏదో వస్తువు తెమ్మని చెప్పి సవిత పారిపోయింది. శైలేశ్ తిన్న భోజనంలో విషం కలిసిందని తెలిసి అతడిని దవాఖానకు తరలించారు. అక్కడ అతడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. చికిత్స పొందుతూ శైలేశ్ మృతి చెందాడు. పోలీసులు సవితను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.