ప్రస్తుత సమాజంలో మనిషి జీవితం ఉరుకుల పరుగులతోనే కొనసాగుతోంది.. బిజిబిజీ జీవితంలో పడి చదువు, ఉద్యోగం, ఇతర బాధ్యతల్లో పడి ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. జంక్ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. చాలామందికి వ్యాయామం చేయడానికి సమయం కూడా దొరకడం లేదు. ఇలాంటి అలవాట్ల వల్ల చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో కొన్ని వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. ఎక్కువ మంది మరణాలకు ఐదు వ్యాధులు కారణమవుతున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదు. మన ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. ఆ వ్యాధిలేవో తెలుసుకుందాం..
*క్యాన్సర్*
మన దేశంలో క్యాన్సర్ అతి పెద్ద ప్రాణాంతక వ్యాధిగా మారుతోంది. ఏటా క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంచనా ప్రకారం, 2025 నాటికి భారతదేశంలో 15.7 లక్షలకు క్యాన్సర్ కేసులు పెరుగుతాయి. అనారోగ్యకరమైన ఆహారం, పొగాకు వాడటం, కాలుష్యం, వ్యాధిని తొలిదశలో గుర్తించకపోవడం వంటి కారణాల వల్ల ఈ కేసులు ఏటా పెరుగుతూ పోతున్నాయి. వ్యాధిని మొదట్లోనే గుర్తించి, సరైన చికిత్స చేయించుకుంటే కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలా మంది వ్యాధిని చాలా ఆలస్యంగా గుర్తిస్తున్నారు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతోంది.
*గుండె జబ్బులు*
భారతీయులు గుండె జబ్బుల బారిన పడటం సర్వసాధారణమైంది. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది హార్ట్ ఎటాక్స్‌తో మరణిస్తున్నారు. 2022లో 32,457 మంది హార్ట్ ఎటాక్ కారణంగా మరణించారు. 2021వ సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య 12.5% పెరిగింది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, షుగర్, పొగాకు వాడటం, వ్యాయామం చేయకపోవడం వంటి అలవాట్ల వల్ల గుండె సమస్యలు పెరుగుతున్నాయి.
*డయాబెటిస్*
ప్రపంచంలోనే అత్యధికంగా షుగర్ రోగులు మన దేశంలోనే ఉన్నారు. 2025 నాటికి భారత్‌లో మొత్తంగా ఏడు కోట్ల మంది బాధితులు ఉండవచ్చని అంచనా. డయాబెటిస్ రెండు రకాలు. ఒకటి టైప్ 1, మరొకటి టైప్ 2. ఈ రెండు రకాల షుగర్ వ్యాధి వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అనారోగ్యకరమైన ఆహారం, అధిక బరువు, వ్యాయామం చేయకపోవడం వల్ల షుగర్ వ్యాధి రావచ్చు.
*క్షయ వ్యాధి*
ట్యూబర్‌క్యులోసిస్ లేదా క్షయ వ్యాధి చాలా మంది భారతీయులను బాధిస్తోంది. ఏటా దాదాపు 28 లక్షల మందికి క్షయ వస్తుంది. ఈ వ్యాధి ముఖ్యంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. కానీ ఇది శరీరంలోని ఇతర భాగాలకూ వ్యాపించవచ్చు. క్షయ రోగుల దగ్గరగా ఉన్నప్పుడు లేదా తుమ్ముతున్నప్పుడు గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దీనికి చికిత్స అందుబాటులో ఉన్నా, చాలా మందికి సరైన చికిత్స దొరకడం లేదు. దీంతో వారి ఆరోగ్యం పాడవుతుంది. టీబీని నియంత్రించాలంటే ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యం.
*ఒబేసిటీ*
మన దేశంలో చాలా మంది ఒబేసిటీ లేదా అధిక బరువుతో బాధపడుతున్నారు. ఎక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల చాలా మందిలో బొజ్జ పెరుగుతోంది. జంక్ ఫుడ్, తీపి పదార్థాలు, ప్యాక్డ్ స్నాక్స్ వంటివి ఆరోగ్యానికి మంచివి కావు. బరువు ఎక్కువగా ఉంటే షుగర్, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా ఇదే కారణం కావచ్చు. బరువు తగ్గాలంటే పండ్లు, కూరగాయలు, గోధుమలు, మాంసం వంటివి బ్యాలెన్స్‌డ్‌గా తినాలి. రోజూ వ్యాయామం చేయాలి.