తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలిని కలిసి వారు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పేర్లు చెప్పి రూ. 18,500 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమైందన్నారు. ఇంత భారీగా ప్రజలపైన విద్యుత్ భారాన్ని మోపడం దారుణం. ఇప్పటికే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని పారిశ్రామిక రంగం వరకు అన్ని సంక్షోభంలో కూరుకుపోయాయని కేటీఆర్ ధ్వజమెత్తారు.
గృహ వినియోగదారులకు సైతం స్థిర చార్జీల పేరుతో విద్యుత్ భారం వేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. పారిశ్రామిక రంగానికి సంబంధించి అన్ని కేటగిరీలకు ఒకటే రేటు నిర్ణయించాలన్న ప్రయత్నం చేస్తుంది. ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ ద్వారా మోపాలని కుట్ర చేస్తుంది. తక్షణమే విద్యుత్ చార్జీలను పెంచాలని ఇచ్చిన ప్రతిపాదన ప్రజలపై అత్యంత భారాన్ని మోపుతుంది. గతంలో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజలపైన విద్యుత్ చార్జీల భారాన్ని వేయలేదు. కాంగ్రెస్ పార్టీ అనేక వర్గాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఉన్న విద్యుత్తుని ఊడగొట్టే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు.