Saturday, September 21, 2024
HomeUncategorizedఒకే ఏడాదిలో ఐదుగురికి భారత రత్నలు

ఒకే ఏడాదిలో ఐదుగురికి భారత రత్నలు

Date:

కేంద్ర ప్రభుత్వం ఒకే సంవత్సరంలో ఐదుగురికి దేశ అత్యున్నత పురస్కారాలు ప్రకటించడం ఇదే మొదటిసారి. గతంలో 1999లో గరిష్ఠంగా నలుగురికి ప్రదానం చేశారు. 1954 మొదలు ఈ అవార్డు జాబితాలో చోటు దక్కించుకున్న వారి సంఖ్య మొత్తం 53కు చేరింది.

కేంద్రం 1954లో రెండు అత్యున్నత పౌర పురస్కారాలు.. భారతరత్న, పద్మవిభూషణ్‌లను ఏర్పాటుచేసింది. ‘పద్మవిభూషణ్‌’లో మూడు విభాగాలు ఉండేవి. 1955లో వీటిని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలుగా మార్చింది. ఏదైనా రంగంలో అసాధారణ సేవలు అందించి, అత్యున్నత స్థాయి పనితీరు ప్రదర్శించినవారికి ‘భారతరత్న’ అందజేస్తారు. ప్రధానమంత్రి ఈ పురస్కారానికి సంబంధించిన సిఫార్సులను రాష్ట్రపతికి అందజేస్తారు. మరే అధికారిక సిఫార్సులు అవసరం లేదు. అవార్డు కింద రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువపత్రం, పతకం అందజేస్తారు. ఎలాంటి నగదు ప్రోత్సాహం లభించదు.

మొదటి ఏడాది (1954)లో సర్వేపల్లి రాధాకృష్ణన్, సి.రాజగోపాలాచారి, సీవీ రామన్‌లకు ఈ పురస్కారం లభించింది. 2019లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ పురస్కారాన్ని అందుకోగా.. భూపెన్‌ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్‌లకు మరణానంతరం ప్రకటించారు. 2020-23 మధ్యకాలంలో ఎవరికీ ఇవ్వలేదు. 2024లో ఇప్పటివరకు బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్‌, భాజపా అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ, మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్‌సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌లకు ప్రకటించారు.