కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలలో జరిగే కంబాలా రేసింగ్ పోటీలను నిలిపివేయాలని కోరుతూ సోమవారం రాష్ట్ర హైకోర్టును పెటా ఆశ్రయించింది. అక్టోబర్ 25వ తేదీన బెంగుళూరులో ఈ ఈవెంట్ జరగాల్సి ఉన్నది. ఆ రేస్‌ను ఆపేయాలని పిల్ వేశారు. జస్టిస్ ఎన్వీ అంజారియా, జస్టిస్ కేవీ అరవింద్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. పిల్ తరపున సీనియర్ న్యాయవాది ధ్యాన్ చిన్నప్ప వాదించారు.
దక్షిణ కన్నడ జిల్లాల్లో కంబాలా దున్నపోతల ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేయడం అక్కడి సాంప్రదాయం. ఆ ఈవెంట్‌ను నిర్వహించేందుకు బెంగుళూరుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన దున్నలను తీసుకువస్తారని చిన్నప్ప తన పిటీషన్లో వాదించారు. ఈ వెంట్‌ను నిర్వహించడమంటే.. జంతువుల్ని క్రూరంగా హింసించడమే అవుతుందని చిన్నప్ప కోర్టుకు తెలిపారు. ఈ ఏడాది జూలైలోనే పిల్ వేశామని, కానీ తమ కేసు లిస్టింగ్ కాలేదని పెటా తెలిపింది. జల్లికట్టు, కంబాలా లాంటి రేసులను నిర్వహించుకునేందుకు గత మే నెలలో సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.