పశ్చిమ బెంగాల్ కోల్కతా ఆర్జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రి ఘటనలో న్యాయం చేకూర్చాలని, తమ డిమాండ్లు నెరవేర్చాలని జూనియర్ వైద్యులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. కాగా ఈ విషయంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ జూనియర్ వైద్యులు దీక్షను వీడాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉందని, అయితే.. వైద్యారోగ్య సేవలపై దాని ప్రభావం పడకూడదని ఆమె వ్యాఖ్యానించారు. వైద్యులు తమ ముందుకు తెచ్చిన డిమాండ్లను ఇప్పటికే నెరవేర్చామని, మిగతా వాటి కోసం 3-4 నెలల సమయం ఇవ్వాలని మమత వైద్యులను కోరారు. ఈ విషయంపై చర్చలకు రావాలని మరోసారి జూనియర్ వైద్యులకు పిలుపునిచ్చారు.
జూనియర్ డాక్టర్లు సోమవారం ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు రావాలని మమత మరోసారి ఆహ్వానించారు. ఆర్జీకర్ ఆసుపత్రి వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ వైద్యుల వేదిక వద్దకు శనివారం చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ వెళ్లారు. ఈ సమయంలో సీఎం వైద్యులతో ఫోన్లో మాట్లాడారు. వైద్యులు చేసిన పలు డిమాండ్లను నెరవేర్చడానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలను ప్రభుత్వానికి వైద్యులు నిర్దేశించడం సరికాదని వ్యాఖ్యానించారు. వైద్యుల డిమాండ్లపై చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.