కేంద్ర రైల్వే శాఖ సిబ్బంది కొరతను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా పలు జోన్లలో 25వేల ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ కొత్త నిబంధన కింద.. సూపర్వైజర్ల నుంచి ట్రాక్‌మెన్ వరకు పలు ఉద్యోగాలకు రైల్వే నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 65 ఏళ్ల లోపు వారు మాత్రమే ఇందుకు అర్హులని చెప్పినట్లు సమాచారం. రెండేళ్ల పదవీకాలానికి గానూ వీరిని నియమించుకోనున్నారు. అవసరమైతే పదవీకాలాన్ని పొడిగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం, ఇప్పటికే అన్ని జోనల్ రైల్వే జనరల్ మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. రిటైర్డ్ ఉద్యోగులు గత ఐదేళ్ల మెడికల్ ఫిట్నెస్తో పాటు, పదవీ విరమణకు ముందు ఉద్యోగంలో ఉన్నప్పుడు వారి పనితీరును పరిశీలించి ఈ నియామకాలు చేపట్టనున్నారు. గతంలో విజిలెన్స్, లేదా డిపార్ట్మెంట్ చర్యలను ఎదుర్కొన్న వారు దరఖాస్తులకు అనర్హులని తేల్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్క వాయవ్య రైల్వే జోన్లోనే 10వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. మిగతా జోన్లలోనూ పెద్ద ఎత్తున సిబ్బంది అవసరం ఉందని రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి.