కేసీఆర్ కుటుంబానికి దోపిడీ చరిత్ర ఉంది. తెలంగాణ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చూస్తున్నారు ” అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. నాలాలు, చెరువులను ఆక్రమించుకున్న వారే హైడ్రాను చూసి భయపడుతున్నారని అన్నారు. చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్‌గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హైడ్రాను చూపి రియల్ ఎస్టేట్‌ను దెబ్బతీయాలని కొంతమంది చూస్తున్నారు. అజీజ్‌నగర్‌లో హరీశ్‌రావుకు ఫాంహౌస్ లేదా? గతంలో కాంగ్రెస్ వల్లనే హరీశ్‌రావుకు మంత్రి పదవి వచ్చింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి గీతారెడ్డికి సద్భావనా అవార్డును సీఎం ప్రదానం చేశారు. గీతారెడ్డికి ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. దేశ సమగ్రత కోసం 34 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేపట్టారు. ఏటా వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నాం. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలందించిన గీతారెడ్డిని సద్భావన అవార్డుకు ఎంపిక చేయడం అభినందనీయం. రాజకీయాల్లో పదవుల కోసం పాకులాడే వారిని చూశాం. కానీ 2023 ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన గొప్ప వ్యక్తి గీతారెడ్డి. గాంధీ కుటుంబం తీసుకున్న నిర్ణయాలతోనే కాంగ్రెస్ హయాంలో దేశంలో పేదలకు మేలు జరిగింది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ప్రధాని పదవులను త్యాగం చేసిన ఘనత సోనియా, రాహుల్‌ది.