హైదరాబాద్ నగరంలోని మూసీ సుందరీకరణను ఎవరూ వ్యతిరేకించడం లేదని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. డ్రైనేజీ సమస్య పరిష్కారం కాకుండా మూసీ సుందరీకరణ జరగదని, తెలంగాణలోని 30 శాతం జనాభా హైదరాబాద్‌లోనే ఉందన్నారు. మూసీ సుందరీకరణను ఎవరూ వ్యతిరేకించడం లేదని స్పష్టంచేశారు. ఇప్పుడున్న మూసీకి రెండువైపులా రిటైనింగ్ వాల్‌ను నిర్మించి అభివృద్ధి చేయవచ్చని సూచించారు. 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న పేదల ఇళ్లను కూల్చవద్దని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ ఆంధ్రాకేఫ్ ఎక్స్ రోడ్లో స్థానిక ఎమ్మెల్యే గోపాల్‌తో కలిపి సేవరేజ్ లైన్‌ను కిషన్ రెడ్డి ప్రారంభించారు.
‘మూసీ సుందరీకరణ పనులు చేయండి.. మూసీ పక్కన ముఖ్యమంత్రి ఇల్లు కట్టండి’ మాకేమీ అభ్యంతరం లేదని ఎద్దేవా చేశారు. కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేసి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తాం.. రూ.25వేలు ఇస్తాం.. ఖాళీ చేయమనడం న్యాయం కాదని హితవు పలికారు. స్థానిక ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా మూసీ సుందరీకరణ పనులు చేయవచ్చని సూచించారు.