కొంతమంది యువకుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. వారి ప్రవర్తన వల్ల సాధారణ జనాలు ఇబ్బందులు పడుతున్నారు. వారి ఆగడాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ప్రాణం తీసేందుకు కూడా వెనకాడటం లేదు. ఇలాంటి ఘటననే తాజాగా అల్వాల్ పరిధిలో చోటుచేసుకుంది. బైకుపై రాష్ గా వెళ్తున్న యువకుడిని ఓ వృద్ధుడు అడ్డుకున్నాడు. అడ్డుకున్న వృద్ధుడిపై అమానుషంగా దాడి చేశాడు. యువకుడి దాడిలో తీవ్ర గాయాల పాలైన వృద్ధుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ వృద్ధుడు ప్రాణాలు వదిలాడు. బైక్ పై ర్యాష్ గా వెళ్తున్న యువకున్ని, నెమ్మదిగా వెళ్ళమని చెప్పిన పాపానికి ఆంజనేయులు అనే వృద్ధుడిని దారుణంగా కొట్టి హతమార్చాడు.
నాకే ఎదురు చెపుతావా అంటూ.. వృద్ధుడిపై దారుణంగా దాడి చేసి చితకబాదాడు ఓ యువకుడు. కింద పడి పోవడంతో వృద్ధుడి తలకు బలమైన గాయం తగిలింది. ఆంజనేయుల్ని బ్రతికించేందుకు లక్షలు ఖర్చుపెట్టినా ప్రాణం దక్కలేదు. తన తండ్రి పై దాడి చేసి మృతికి కారణమైన యువకుడి పై చర్యలు తీసుకోవాలని ఆంజనేయులు కొడుకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వృద్ధుడి మృతికి కారణమైన యువకున్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.