పొరుగుదేశం పాక్ అనుకూల నినాదాలు చేసిన వ్యక్తికి బెయిల్ మంజూరు సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అతడిలో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కేసు విచారణ ముగిసేవరకు పోలీస్‌స్టేషన్‌లో జాతీయ జెండాకు సెల్యూట్ చేయాలని, ‘భారత్ మాతాకీ జై’ అని నినాదాలు చేయాలని ఆదేశించింది. నెలలో రెండుసార్లు ఇలా చేయాలంటూ జస్టిస్ డీకే పలివాల్ నేతృత్వంలోని ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఫైజల్ అలియాస్ ఫైజాన్ ఈ ఏడాది మే నెలలో పాక్ అనుకూల నినాదాలు చేశారన్న కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్‌ను అగౌరవపరుస్తూ.. పాక్ అనుకూల నినాదాలు చేస్తున్న వీడియో ఆధారంగా ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద వర్గాల మధ్య చిచ్చు, దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరించడం వంటి అభియోగాలను మోపారు. తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా రూ.50వేలు పూచీకత్తుపై ఫైజాన్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరుచేసింది. బెయిల్ షరతుల్లో భాగంగా ఫైజాన్ ప్రతినెలా తొలి, నాలుగో మంగళవారం భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని కోర్టు ఆదేశించింది. విచారణ ముగిసేవరకు ఈ ప్రక్రియ కొనసాగాలంది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ప్రతిసారీ జాతీయజెండాకు 21 సార్లు సెల్యూట్ చేయాలని, భారత్ మాతాకీ జై అని రెండుసార్లు నినదించాలని ఆదేశాలిచ్చింది. తాను పుట్టి, పెరిగిన దేశాన్ని గౌరవించాలన్న ఉద్దేశంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయర్ బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. గతంలోనూ అతడిపై 14 కేసులు ఉన్నాయని వాదించారు.