Thursday, December 26, 2024
Homeజాతీయంర‌త‌న్ టాటా 12వేల వ‌జ్రాల చిత్రం వేలం

ర‌త‌న్ టాటా 12వేల వ‌జ్రాల చిత్రం వేలం

Date:

దేశంలోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా మ‌ర‌ణం దేశానికి తీర‌నిలోటు. ఈ సమయంలో ఆయనకు చెందిన ఒక కళాఖండాన్ని వేలం వేయనున్నారు. స్వచ్ఛంద కార్యక్రమాల కోసం 12 వేల వజ్రాలు పొదిగిన ఆ చిత్రాన్ని వేలంలో ఉంచనున్నారు. ముంబయికి చెందిన కళాకారుడు శైలేశ్‌ ఆచ్రేకర్‌ 12వేల వజ్రాలతో రతన్‌ టాటా చిత్రాన్ని రూపొందించారు. డిసెంబర్ 28న ఆయన పుట్టినరోజున బహూకరిద్దామని భావించారు. కానీ ఈలోపే అక్టోబర్ 9న టాటా తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ”రతన్‌జీ గౌరవార్థం ఆయనకు ఏదైనా కానుకగా ఇవ్వాలని ఆలోచన రాగానే.. దీనిని ప్రత్యేకంగా తీర్చిదిద్దాను. అందుకు ఆరునెలల సమయం పట్టింది. పుట్టినరోజు నాడు ఆయన్ను వ్యక్తిగతంగా కలిసి, ఈ బహుమతి ఇద్దామనుకున్నాను. కానీ ఆయన మరణంతో నా కల నెరవేరలేదు” అని విచారం వ్యక్తచేశారు.

”దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఆయన మనతో లేరు. ఆయన అందించిన సేవలకు నివాళిగా దీనిని వేలం వేయాలని నిర్ణయించాం. అలా సేకరించిన మొత్తాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు కేటాయించాలని అనుకుంటున్నాం” అని శైలేశ్‌ తెలిపారు. ముఖ్యంగా శునకాల బాగోగులు చూసే సంస్థల వంటివాటికి ఆ మొత్తాన్ని ఇవ్వాలని అనుకుంటున్నామని తెలిపారు. రతన్‌జీని అభిమానించే ఈ కళాకారుడి పుట్టినరోజు కూడా డిసెంబర్ 28నే కావడం గమనార్హం. ఈయన గతంలో శివసేన వ్యవస్థాపకులు, దివంగత బాలాసాహెబ్‌ ఠాక్రే కళాఖండాన్ని కూడా రూపొందించారు. దానిలో 27 వేల వజ్రాలను పొదిగారు.