Wednesday, October 16, 2024
Homeతెలంగాణన్యాయం చేస్తేనే బాధితుల‌కు పోలీస్ వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం

న్యాయం చేస్తేనే బాధితుల‌కు పోలీస్ వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం

Date:

న్యాయం జరిగితేనే బాధితులకు పోలీసు వ్యవస్థపై నమ్మకం వస్తుందని, సమాజ శ్రేయస్సు కోసం పోలీసులు శక్తి వంచన లేకుండా పని చేయాలని తెలంగాణ డిజిపి జితేంద‌ర్ తెలిపారు. రాజేంద్రనగర్‌లోని పోలీసు అకాడమీలో తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మొదటి పోలీస్ డ్యూటీ మీట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో మొదటి పోలీసు డ్యూటీ మీట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం పోలీసుల్లో బృంద స్ఫూర్తిని పెంచుతుందని తెలిపారు. అన్ని కేసులను సాంకేతిక ఆధారాలతో ఛేదించాలని సూచించారు. న్యాయం జరిగితేనే బాధితులకు పోలీసు వ్యవస్థపై నమ్మకం వస్తుందని చెప్పారు. సమాజ శ్రేయస్సు కోసం పోలీసులు శక్తి వంచన లేకుండా పని చేయాలన్నారు. నిరంతరం నేర్చుకుంటూ, తప్పులు సరిదిద్దుకుంటూ, జాగ్రత్తలు పాటిస్తేనే నేరాల ఛేదన సాధ్యమవుతుందని తెలిపారు.

పోలీసు డ్యూటీ మీట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా సీఎస్ శాంతి కుమారి హాజరయ్యారు. నేటి నుంచి 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన 400 మంది పోలీసులు పాల్గొన్నారు. దైనందిన డ్యూటీలో భాగంగా కేసుల విచారణలు, మెలకువలపై ఇక్కడ పోటీలు ఏర్పాటు చేశారు. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, కంప్యూటర్ అవేర్‌నెస్‌ తదితరాలపై పోటీలున్నాయి. కేసుల ఛేదన, ఆధారాల సేకరణపై ఉన్నతాధికారులు సూచనలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్‌ భగవత్, శిఖా గోయల్ సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.