Thursday, October 31, 2024
Homeజాతీయంమీకు ఓటు వేశా.. నాకు పెళ్లి చేయండి

మీకు ఓటు వేశా.. నాకు పెళ్లి చేయండి

Date:

ఒక వ్యక్తి ఎమ్మెల్యే వ‌ద్ద‌కు పరిగెత్తుకొచ్చి నీకు ఓటేశాన‌ని తనకు పెళ్లి చేయాలని కోరాడు. ఆ వ్యక్తి ఎమ్మెల్యేతో జరిపిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని చర్ఖారీ నియోజకవర్గానికి బ్రిజ్‌భూషణ్‌ రాజ్‌పుత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తన వాహనంలో వెళ్తూ మహోబా ప్రాంతంలో పెట్రోల్‌ కొట్టించుకునేందుకు ఒక బంక్ వద్ద బండిని ఆపారు. అక్కడే పనిచేస్తోన్న స్థానిక వ్యక్తి అఖిలేంద్ర ఖరే..ఎమ్మెల్యేను చూసి ఆయన వద్దకు పరిగెత్తారు. ఏదైనా సాయం కోసం వస్తున్నాడేమో అని బ్రిజ్‌భూషణ్ భావించారు. కానీ అఖిలేంద్ర మాత్రం తాను పెళ్లి చేసుకునేందుకు ఒక అమ్మాయిని చూడాలని అడగడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అప్పుడు వారిద్దరు ఇలా మాట్లాడుకున్నారు.

ఎమ్మెల్యే: నీ వయసెంత..?
అఖిలేంద్ర: త్వరలో 44 వస్తాయి
ఎమ్మెల్యే: అయినా ఒక అమ్మాయిని చూడాలని నన్నే ఎందుకు అడుగుతున్నావు..?
అఖిలేంద్ర: నా ఓటు మీకే వేశా (అంటూ తడుముకోకుండా సమాధానం ఇచ్చాడు)
ఎమ్మెల్యే: అయితే నేను నీకు పెళ్లి చేయాలన్నమాట. మరి ఎలాంటి అమ్మాయి కావాలేంటి..?
కొన్ని వర్గాలకు చెందిన వారు వద్దని అఖిలేంద్ర సమాధానం ఇవ్వగా.. అలా ఎప్పుడూ వివక్ష చూపకూడదని, ఎవరితో రాసిపెడితే వారితోనే వివాహం జరుగుతుందని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. ”నీకు త్వరగా పెళ్లి కావాలని కోరుకుంటున్నా. నాకు ఓటేశావు కదా.. నా వంతు ప్రయత్నం చేస్తా. ఇంతకీ నీ జీతం ఎంత..?” అని అడిగారు. తనకు రూ.6వేల జీతం వస్తుందని, 13బిగాల భూమి ఉందని ఆ వ్యక్తి చెప్పారు. ఇలా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు సరదా కామెంట్లు పెట్టారు.