ప్రభుత్వ టీచర్లే తెలంగాణ వారధులు.. నిర్మాతలని, పేద విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దే బాధ్యత మీపైనే ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డీఎస్సీ విజేతలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ కొత్త టీచర్లకు కీలక సూచనలు చేశారు.
నిరుపేదలు బంగారం అమ్మి ప్రైవేటు పాఠశాలలకు పిల్లల్ని పంపే పరిస్థితి మారాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయులే ఈ పరిస్థితికి కారణాలను అన్వేషించాలన్నారు. ”తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు వారిని భవిష్యత్తులో డాక్టర్లుగా, లాయర్లు, ఇంజినీర్లు, సైంటిస్టులు, ఐఏఎస్, ఐపీఎస్‌లు, ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీదే. నేను ప్రభుత్వ బడిలో చదువుకున్నా.. సీఎం అయ్యాను. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేశవరావు, కోదండరాం వంటి ఎందరో ప్రభుత్వ బడిలోనే చదివారు. కార్పొరేట్ బడిలో చదువుకోలేదు. మీలాంటి టీచర్లు చెప్పిన చదువుతోనే ఈ స్థాయికి వచ్చాం. జాతి నిర్మాతలను తీర్చిదిద్దిన క్షేత్రం ప్రభుత్వ బడి. తెలంగాణలో 30వేల పాఠశాలలు ఉంటే.. 24లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేటు యాజమాన్యంలో 10 వేల పాఠశాలలు ఉంటే 34లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేటులో మీకంటే ఎక్కువ చదువుకున్నవారు, మీకన్నా గొప్ప వ్యక్తులు, అనుభవం ఉన్నవారు బోధిస్తున్నారా?” అని ప్రశ్నించారు.