తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ(హైడ్రా)కి విస్తృతాధికారాలు కల్పిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు శనివారం రాజ్‌భవన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు హైడ్రాకు ఈ ఆర్డినెన్స్ రక్షణగా ఉండనుంది.
ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా.. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ నివృత్తి చేయడంతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తుల్ని సంరక్షించడంతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు కురిసినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్ధీకరించడం, అగ్నిమాపకశాఖ సేవలకు ఎన్వోసీ జారీచేయడం తదితర లక్ష్యాలతో జులై 19న జీవో ఎం.ఎస్ 99 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలో చేర్చారు. హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తుండగా.. ఆర్డినెన్స్‌తో మరిన్ని కీలక అధికారాలు హైడ్రాకు దఖలు పడ్డాయి. ఆ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇటీవలే పలువురు ఉన్నతాధికారులు సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది.