Saturday, December 21, 2024
Homeజాతీయంరాష్ట్రాల‌కు చెప్పే ఓపిక న‌శించింది

రాష్ట్రాల‌కు చెప్పే ఓపిక న‌శించింది

Date:

వలస కార్మికులకు కార్డుల జారీలో జాప్యం చేస్తున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రాల తీరు ఆందోళనకరమని, ఈ విషయంలో తమకు ఇక ఓపిక నశించిందని పేర్కొంది. ”ఈ అంశంలో ఎలాంటి ఉదాసీనతకు చోటు లేదని మరోసారి స్పష్టంగా చెబుతున్నాం. ఇక మాకు ఓపిక నశించింది. మా ఉత్తర్వులను పాటించేందుకు మీకు చివరి అవకాశం ఇస్తున్నాం. లేదంటే మీ కార్యదర్శులు కోర్టుకు రావాల్సి ఉంటుంది” అని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. ఈ వ్యవహారంపై నవంబరు 19లోగా కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

కొవిడ్‌ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని.. సర్వోన్నత న్యాయస్థానం 2020లో దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే జాతీయ ఆహార భద్రత చట్టం కింద కోటాతో సంబంధం లేకుండా.. ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న దాదాపు 8 కోట్ల వలస కార్మికులకు రేషన్‌ కార్డులు జారీ చేయాలని 2021లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఇప్పటివరకు కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేయగా.. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జాప్యం చేస్తున్నాయి. దీంతో సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.