Saturday, December 21, 2024
Homeజాతీయంపోలీసుల ప‌క్కా వ్యూహాం.. రెండురోజుల ఆప‌రేష‌న్‌.. 1500మంది పోలీసుల మూకుమ్మడి దాడి..

పోలీసుల ప‌క్కా వ్యూహాం.. రెండురోజుల ఆప‌రేష‌న్‌.. 1500మంది పోలీసుల మూకుమ్మడి దాడి..

Date:

తుపాకీ తూటాల‌తో దండకార‌ణ్యం ద‌ద్ద‌రిల్లింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ- నారాయణ్‌పుర్‌ సరిహద్దులో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 36 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ భారీ ఆపరేష న్‌ గురించి కీలక వివరాలను పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో డిస్ట్రిక్ట్ రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్‌జీ)కి చెందిన 1500 మంది పోలీసులు పాల్గొన్నట్లు దంతెవాడ అడిషనల్‌ ఎస్పీ ఆర్కే బర్‌మన్ తెలిపారు. పక్కా వ్యూహంతో రెండు రోజుల పాటు ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు. అక్టోబరు 3 ఉదయమే ఆపరేషన్‌ ప్రారంభించినట్లు చెప్పారు. మావోయిస్టులకు చెందిన కంపెనీ నెంబర్‌ 6, తూర్పు బస్తర్‌ డివిజన్‌ దళాలు గవాడి, థుల్‌థులి, నెందూర్‌, రెంగవయా గ్రామాల్లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చిందని, దానిని రూఢీ చేసుకున్న తర్వాత ఆపరేషన్‌ చేపట్టామని తెలిపారు.

ఆపరేషన్‌ చేపట్టేందుకు భద్రతాబలగాలు తీవ్రంగా శ్రమించాయి. మావోయిస్టుల కంట పడకుండా ఎత్తైన కొండ ప్రాంతానికి చేరుకునేందుకు 10 కి.మీ మేర ద్విచక్రవాహనాలపై వెళ్లి, ఆ తర్వాత 12 కి.మీ మేర నడవాల్సి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. నెందూర్‌, థుల్‌థులి గ్రామాల్లో చీకటి పడేవరకు కొనసాగాయి. శుక్రవారమే 28 మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. శనివారం మరో 3 లభ్యమయ్యాయి. ఈ ఆపరేషన్‌కు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు బలగాలు కూడా సహకారం అందించాయి.” అని ఆర్కే బర్‌మన్‌ వెల్లడించారు.

మృతి చెందిన మావోయిస్టులను పీపుల్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీకి చెందిన వారిగా గుర్తించామని బస్తర్‌ రేంజ్ ఐజీ సుందర్‌ రాజ్‌ పేర్కొన్నారు. మృతదేహాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత వారు ఎవరెవరన్నది తేలుతుందని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో ఓ జవాన్‌కు తీవ్రంగా గాయాలయ్యాయని, ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతున్నట్లు చెప్పారు. భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సుందర్‌రాజ్‌ తెలిపారు. ఏకే-47 రైఫిల్‌, ఎస్‌ఎల్‌ఆర్‌, ఇన్‌సాస్‌, ఎల్‌ఎంజీతోపాటు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. తాజా ఎన్‌కౌంటర్‌తో బస్తర్ రీజియన్‌లో ఈ ఏడాది మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 188కి చేరింది. చివరిగా ఏప్రిల్‌ 16న కాన్కేర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మృతి చెందారు. వారిలో ఉన్నత కేడర్‌కు చెందిన వారు కూడా ఉన్నట్లు అప్పట్లో పోలీసులు వెల్లడించారు.