బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు అత్యంత కిరాతకానికి పాల్పడ్డారు. కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు 600 మందిని పిట్టల్ని కాల్చేసినట్లు కాల్చి చంపారు. ఆగస్టులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించారు. మృతదేహాలను సేకరించేందుకే మూడు రోజులు పట్టిందట..! ఆగస్టు 24న పశ్చిమ ఆఫ్రికా దేశం బర్సాలోగో పట్టణంపై బైక్‌లపై దూసుకొచ్చిన ఉగ్రవాదులు కన్పించినవారిని కాల్చేశారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే కావడం గమనార్హం. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లామ్ వాల్ ముస్లిమిన్ (జేఎన్ఐఎం) మిలిటెంట్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.
బుర్కినాఫాసోలో మిలిటెంట్లు తరచూ దాడులకు పాల్పడుతుండటంతో ప్రజల భద్రత దృష్ట్యా గ్రామాల చుట్టూ లోతైన కందకాలు తవ్వుకోవాలని అక్కడి మిలిటరీ ఆదేశించింది. దీంతో ఆగస్టు 24న బర్సాలోగో ప్రజలు తవ్వకాలు జరుపుతుండగా ఉగ్రవాదులు వారిని సైనికులుగా భావించి దాడికి పాల్పడ్డారు. ప్రాణభయంతో ప్రజలు పరుగులు పెట్టినా వెంటాడి మరి కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు కథనాలు వెల్లడించాయి. తొలుత ఈ ఘటనలో 200 మంది మరణించినట్లు ఐరాస అంచనా వేసింది. కానీ, దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా గణాంకాలు వెలువడ్డాయి.
ఘటన తర్వాత మృతదేహాలను సేకరించేందుకు స్థానిక అధికారులకు మూడు రోజుల సమయం పట్టిందని ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. ఈ దాడి తర్వాత బుర్కినా ఫాసో వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కానీ, వారిని సైన్యం అణచివేసినట్లు తెలుస్తోంది. ఈ దేశంలో రెండుసార్లు సైన్యం తిరుగుబాటు చేసిన తర్వాత 2022లో పాలన మిలిటరీ జుంటా చేతుల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇలాంటి ఊచకోతలు తరచూ జరుగుతున్నాయి. గతంలో మిలిటెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ రెండు గ్రామాల్లోని దాదాపు 200 మందికి పైగా పౌరులను సైన్యమే కాల్చి చంపడం గమనార్హం.