Saturday, December 21, 2024
Homeజాతీయంరైల్వేల‌ను ప్రైవేటీక‌రించే ప్ర‌శ్నేలేదు

రైల్వేల‌ను ప్రైవేటీక‌రించే ప్ర‌శ్నేలేదు

Date:

దేశంలో రైల్వేశాఖను ప్రైవేటీకరించే ప్రస‌క్తే లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టంచేశారు. తమ దృష్టంతా తక్కువ ధరకు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంపైనే ఉందన్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ రైజింగ్‌ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రూ.400 కన్నా తక్కువ ఖర్చుతోనే ప్రజలు వెయ్యి కి.మీల వరకు సౌకర్యవంతంగా ప్రయాణించేలా చూడటమే తమ లక్ష్యమని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రైల్వేలో పూర్తిస్థాయిలో మార్పులు వస్తాయన్నారు. వందేభారత్‌, నమో భారత్‌ వంటి రైళ్లతో పాటు రైల్వే రక్షణ యంత్రాంగం కవచ్‌ ఏర్పాటు ద్వారా ఈ మార్పులు తీసుకోస్తామని చెప్పారు. ఇది రైల్వేల పరివర్తన యుగంగా అభివర్ణించారు.

రైల్వేలను ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని, రైల్వేలు, రక్షణ వ్యవస్థ భారత దేశానికి వెన్నెముకలాంటివన్నారు. ఈ విషయాన్ని అసత్యాలు ప్రచారం చేస్తున్నవారు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. రైల్వేల రాజకీయీకరణకు ప్రధాని నరేంద్ర మోదీ చెక్‌ పెట్టారని, ప్రస్తుతం పనితీరు, భద్రత, సాంకేతికత, అందరికీ తక్కువ ధరలకే సేవలందించడంపైనే దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. ఆర్‌పీఎఫ్‌ జోనల్ సెంటర్ల అప్‌గ్రేడ్‌కు రూ.35కోట్లు కేటాయించామన్న మంత్రి వైష్ణవ్‌.. సర్వీస్‌ నిబంధనలు, ప్రమోషన్లు వంటి డిమాండ్లను పరిశీలిస్తున్నామన్నారు. గత పదేళ్లలో 31 వేల కి.మీల మేర కొత్త ట్రాక్‌లు నిర్మించినట్లు వెల్లడించారు.