తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు నాగార్జున ఖండించారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖగారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. -ఎక్స్ వేదికగా సినీ నటుడు నాగార్జున
ఇంతకీ కొండా సురేఖ ఏమన్నారంటే..?
బీసీ మహిళనైన తనపై అసభ్యకర పోస్టులు పెట్టడం బాధాకరమని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టాలని కేటీఆరే ఆ పార్టీ కార్యకర్తలకు చెప్పినట్లు ఉందన్నారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని అన్నారు. కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ అని ఆరోపించారు. అంతేకాదు, నాగార్జున కుటుంబంలో చోటు చేసుకున్న పరిస్థితులకు కూడా కేటీఆర్ కారణమని ప్రస్తావించారు. ఆయన మత్తు పదార్థాలకు అలవాటు పడి, సినిమా వాళ్లకు కూడా వాటిని అలవాటు చేశారని విమర్శించారు. రేవ్ పార్టీలు చేయడంతో పాటు, సినీతారలను ఇబ్బంది పెట్టిన వ్యక్తి కేటీఆర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది సినిమా పరిశ్రమలో ఉన్న వారందరికీ తెలుసని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అయ్యాయి. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా మండిపడ్డారు. ”సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా..?’ అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.