Sunday, December 22, 2024
Homeజాతీయంఒకే కుటుంబంలో ఇప్ప‌టికి 630లీట‌ర్ల ర‌క్త‌దానం

ఒకే కుటుంబంలో ఇప్ప‌టికి 630లీట‌ర్ల ర‌క్త‌దానం

Date:

ఆప‌ద‌లో ఉన్న‌వారికి ర‌క్త‌దానం ప్రాణ‌దానంతో స‌మానం.. కాని చాలా మంది ర‌క్త‌దానం చేయ‌డానికి భ‌య‌ప‌డుతుంటారు. ప్ర‌భుత్వంతో పాటు ప‌లు స్వ‌చ్చంధ సంస్థ‌లు ర‌క్త‌దానంతో అవ‌గాహ‌న కూడా క‌ల్పిస్తున్నారు. ఐనా ర‌క్త‌దానం చేసేవారి సంఖ్య త‌క్కువ‌గానే ఉంటోంది. అలాంటిది గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబం మాత్రం పదుల సంఖ్యలో రక్తదానాలు చేస్తూ ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతోంది. ఆ కుటుంబంలోని 16 మంది ఇప్పటివరకు 630 లీటర్ల రక్తాన్ని దానం చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. అహ్మదాబాద్‌లోని మణేక్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన పటేల్‌ కుటుంబంలో 27 మంది సభ్యులున్నారు. వీరిలో 16 మంది ఇప్పటివరకు 50 సార్లకు పైనే రక్తదానం చేశారు. 100ఏళ్లకు దగ్గర్లో ఉన్న నలుగురు వృద్ధులైతే ఏకంగా 100 సార్లకు పైగా రక్తాన్ని దానమివ్వడం విశేషం. మొత్తంగా ఇప్పటివరకు 1400 యూనిట్ల రక్తదానం చేశారు. ఒక్కో యూనిట్‌కు 450 మిల్లీలీటర్ల చొప్పున చూసుకుంటే.. ఇప్పటివరకు వీరంతా 630 లీటర్ల వరకు దానం చేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

నేడు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని అహ్మదాబాద్‌లో రక్తదాతలను అభినందిస్తూ ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఈ పటేల్‌ కుటుంబం గురించి తెలిసింది. ఈ సందర్భంగా ఈ కుటుంబానికి చెందిన డాక్టర్‌ మౌలిన్‌ పటేల్‌ మాట్లాడుతూ.. ”సత్యసాయి బాబా స్ఫూర్తితో మా మామ రమేశ్‌భాయ్‌ ఈ రక్తదానాన్ని ప్రారంభించారు. ఆయన 94 సార్లు రక్తాన్ని దానం చేశారు. ఆయన కుమారుడైతే 103 సార్లు రక్తదానం చేశారు. దాన్నే మా కుటుంబం సంప్రదాయంగా కొనసాగిస్తూ వస్తోంది” అని తెలిపారు. ఇదే ప్రాంతానికి చెందిన మలవాంకర్ కుటుంబం 790 యూనిట్లు (356 లీటర్ల) రక్తదానం చేసినట్లు సదరు కథనాలు పేర్కొన్నారు. ఏదేమైనా రక్తదానంతో ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపుతూ ఎంతోమంది యువతకు వీరంతా ప్రేరణగా నిలుస్తున్నారు.