Saturday, September 21, 2024
HomeUncategorizedదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాం

దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాం

Date:

దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నామని కేంద్రం వెల్లడించింది. దేశ ఆర్థిక స్థితిగతులపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం లోక్‌సభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. గత యూపీఏ పాలనతో పోలిస్తే.. తమ పదేళ్ల పాలనలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో అందులో వివరించారు. దీనిపై శుక్రవారం సభలో చర్చ జరపనున్నారు. ఆర్థికవృద్ధి పరంగా 2014 వరకు మనం ఎక్కడ ఉన్నాం.. ఇప్పుడు ఏ స్థాయికి చేరాం అని తెలుసుకోవడానికి ఇది సరైన సమయం. గత ప్రభుత్వాల పాలనలో నిర్వహణ లోపాల నుంచి పాఠాలు నేర్చుకుని.. వృద్ధి దిశగా ఎలా పయనిస్తున్నామో చెప్పడమే మా ఉద్దేశం. అందుకే ఈ శ్వేత పత్రాన్ని సభ ముందుకు తీసుకొచ్చాం అని నిర్మలా సీతారామన్‌ ఈసందర్భంగా వెల్లడించారు.

శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలు..

2004లో యూపీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటికి భారత్‌ ఆర్థిక వ్యవస్థ 8శాతం వృద్ధిరేటులో పయనించింది. అలాంటిది పదేళ్లలో ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్‌ సర్వనాశనం చేసింది. మునుపటి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక సరళీకరణను యూపీఏ తుంగలోకి తొక్కింది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ప్రభుత్వ ఆస్తులను చిన్న చూపు చూసి, స్థూల ఆర్థిక పునాదులను దెబ్బతీసింది. యూపీఏ హయాంలో ఆస్పత్రి ఖర్చులు ప్రజలకు ఎంతో భారమయ్యాయి. 2014లో దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. గత యూపీఏ ప్రభుత్వం వారి పదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థను అచేతన స్థితిలో ఉంచింది. యూపీఏ మాదిరిగా కాకుడా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ఎన్డీయే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీర్ఘకాల ప్రయోజనాల కోసం కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేయడంలో యూపీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఆర్థిక వృద్ధిని అడ్డుకునేందుకు సమస్యలను సృష్టించింది. వారు వదిలేసిన సవాళ్లను ఈ పదేళ్లలో మేం విజయవంతంగా అధిగమించాం. మోదీ హయాంలో ఆర్థిక నిర్వహణ.. దేశాన్ని ఆర్థిక వృద్ధికి స్థిరమైన మార్గంలో నడిపిస్తోంది.