Sunday, September 29, 2024
Homeజాతీయంకాంగ్రెస్‌ సభల్లో పాకిస్థాన్‌ నినాదాలు 

కాంగ్రెస్‌ సభల్లో పాకిస్థాన్‌ నినాదాలు 

Date:

కాంగ్రెస్‌ సభల్లో పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు పెరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న సభల్లో ఈ నినాదాలు లేవనెత్తుతున్నారని ఆయన అన్నారు. బాద్షాపుర్‌ ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీపై విరుచుకుపడ్డారు. బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్‌కు కంటిమీద కునుకులేకుండా పోయిందన్నారు.

”హరియాణాలో కొత్త ట్రెండ్‌ చూస్తున్నాను. హతిన్‌ నుంచి థానేసర్‌ వరకు, థానేసర్‌ నుంచి పల్వల్‌ వరకు పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు మిన్నంటుతున్నాయి. మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇలాంటి నినాదాలు చేస్తుంటే ఎందుకు మాట్లాడకుండా ఉంటున్నారు?” అని రాహుల్‌ గాంధీని ప్రశ్నించారు. ఆర్టికల్‌ 370కి తిరిగి తీసుకొస్తామని కాంగ్రెస్‌ ఇచ్చిన హామీపై ఆయన విరుచుకుపడ్డారు. ” కశ్మీర్‌ మనదా? కాదా? ఆర్టికల్ 370ని తొలగించడం సరైందా? కాదా? ఈ ఆర్టికల్‌ను మళ్లీ తీసుకొస్తామని కాంగ్రెస్‌, రాహుల్‌లు చెబుతున్నారు. రాహుల్‌ గాంధీ.. మరో మూడు తరాలు మారినా దీన్ని వెనక్కి తీసుకురాలేవు. కశ్మీర్‌ను రక్షించేందుకు హరియాణా యువత ఎన్నో త్యాగాలు చేశారు. వాటిని వృథా కానివ్వం” అని అమిత్‌ షా అన్నారు.