Saturday, September 28, 2024
Homeతెలంగాణమ‌హిళ‌ల విష‌యంలో స‌మాజ ఆలోచ‌నా మారాలి

మ‌హిళ‌ల విష‌యంలో స‌మాజ ఆలోచ‌నా మారాలి

Date:

స‌మాజంలో మ‌హిళ‌ల విష‌యంలో ఆలోచ‌న ధోర‌ణి మారాల‌ని, మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాల‌కు చెక్ పెట్టేందుకు స‌త్వ‌ర ప‌రిష్కారం కావాల‌ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. దేశంలో మహిళా లాయర్లతో జాతీయ స్థాయిలో ఒక బలమైన నెట్‌వర్క్ ఏర్పాటు చేయాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్ శివారులోని నల్సార్ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వర్సిటీలోని వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బంగారు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు గవర్నర్ అలోక్ అరాధే, తదితరులు హాజరయ్యారు.

అనేక రంగాల్లో ముందడుగు వేసిన మన సమాజం.. మహిళాభ్యుదయం విషయంలో మాత్రం వెనకబడే ఉందని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏదోమూల నేటికీ వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని, వాటిని అరికట్టాలంటే నల్సార్ వంటి లా వర్సిటీలన్నీ కలిసి, మహిళా వకీళ్లుగా ఉన్న తమ పూర్వ విద్యార్థులతో ఓ జాతీయ నెట్‌వర్క్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలన్నారు. మనదేశంలో నేటికీ సంపన్నులకు అందినంత వేగంగా పేదలకు న్యాయం అందటం లేదని, కనుక న్యాయవాదులు, అట్టడుగు వర్గాల బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ బీహార్‌లోని చంపారన్ పేద రైతుల పక్షాన నిలిచి విజయం సాధించారని గుర్తుచేశారు. ప్రతి 10 గ్రామాలకు ముగ్గురు న్యాయాధికారులు ఉండాలని, వివాదం పరిష్కారం అయ్యే వరకు జడ్జీలు, పిటిషనర్ల మధ్య ఎలాంటి ప్రైవేట్ సంభాషణలు ఉండకూడదని చాణిక్యుడు తన అర్థశాస్త్రంలో చెప్పిన విషయాన్ని ముర్ము ప్రస్తావించారు.