తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దేందుకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సారథ్యంలో జరిగిన సమావేశాల్లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి చొరవతో దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అనుమతి ఇచ్చారు. వెంటనే ఆ పనులను ప్రారంభించాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బంగారు తాపడం పనుల బాధ్యతలను స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ పనులు స్వామి బ్రహ్మోత్సవాల నాటికి ముందే 2025 మార్చిలోగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ పనులను నిరంతరం పర్యవేక్షించేందుకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఛైర్‌పర్సన్‌గా, దేవాదాయ శాఖ డైరెక్టర్ కన్వీనర్‌గా ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సలహాదారు, వైటీడీఏ ఉపాధ్యక్షుడు జి.కిషన్‌రావు, యాదగిరిగుట్ట దేవస్థాన కార్యనిర్వహణాధికారి, విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బంగారు తాపడం పనులను పర్యవేక్షిస్తూ సూచనలు, సలహాలివ్వనున్నారు. ఈ మేరకు బంగారు తాపడం పనులు, ఈ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు సంబంధించి రెండు వేర్వేరు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీసీతారామ చంద్రస్వామి దేవాలయ అభివృద్ధి, విస్తరణ పనుల నిమిత్తం భూసేకరణకు అనుమతులను మంజూరు చేస్తూ మరో జీవో జారీ చేసింది.