Sunday, December 22, 2024
Homeజాతీయంపండుగ‌ల కోసం 6,000 ప్రత్యేక రైళ్లు

పండుగ‌ల కోసం 6,000 ప్రత్యేక రైళ్లు

Date:

దేశంలో ద‌స‌రా, దీపావ‌ళి పండుగ‌ల కోసం ప‌ట్ట‌ణాల‌లో ఉన్న‌వారంతా త‌మ స్వంత గ్రామాల‌కు వెళతారు. తమ సొంతూర్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో కలిసి వేడుకలు చేసుకునేందుకు, ఎక్కువ శాతం ప్రజలు ప్రయాణం చేస్తారు. పండుగల కోసం ఇంటికి వెళ్తున్న ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో.. దుర్గాపూజ, దీపావళి, ఛత్ పండుగల కోసం ప్రయాణికులు తమ సొంత గ్రామాలకు వెళ్తారు. ఈ క్రమంలో.. భారతీయ రైల్వే దాదాపు 6,000 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. అంతేకాకుండా.. 108 రైళ్లకు అదనపు జనరల్ కోచ్‌లు జత చేశారు. పండుగల సమయంలో కనిపించే అదనపు రద్దీని తగ్గించడానికి 12,500 కోచ్‌లను మంజూరు చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

దుర్గాపూజ, దీపావళి, ఛత్ పండుగల సమయంలో ఎక్కువగా బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లకు వెళ్లే మార్గాల్లో భారీ రద్దీ ఉంటుంది. ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 5,975 ప్రత్యేక రైళ్లను నోటిఫై చేశామని.. గత ఏడాది 4,429 ప్రత్యేక రైళ్లను నడిపించామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. “ఈ పండగల సమయంలో కోటి మందికి పైగా ప్రయాణికులు ఇంటికి వెళ్ళడానికి ఇది సులభతరం చేస్తుంది” అని ఆయన చెప్పారు. దుర్గాపూజ అక్టోబర్ 9 న ప్రారంభమవుతుంది.. దీపావళి అక్టోబర్ 31న జరుపుకోనున్నారు. ఛత్ పూజ నవంబర్ 7, 8 తేదీలలో జరుగుతుంది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని దసరా, దీపావళి పండుగలకు మాత్రమే కాకుండా సంక్రాంతి, వినాయక చవితి వంటి పండుగలకు, కుంభమేళా వంటి సమయాలలో కూడా విశేషంగా సేవలను అందిస్తూ ప్రత్యేక రైళ్లను నడుపుతూ భారతీయ రైల్వే ప్రజల అవసరాలను తీరుస్తుంది.