Wednesday, October 30, 2024
Homeప్రత్యేక కథనాలుపండుగ‌ల ఆఫర్స్ పేరుతో సైబ‌ర్ కొత్త మోసాలు

పండుగ‌ల ఆఫర్స్ పేరుతో సైబ‌ర్ కొత్త మోసాలు

Date:

ఇప్పుడంతా పండుగ‌ల సీజ‌న్ కావ‌డంతో ఆన్‌లైన్ సంస్థ‌లు భారీగా ఆప‌ర్స్ పెట్టాయి. అయితే ఇదే అద‌నుగా భావించిన సైబర్ క్రిమినల్స్ కూడా ప్రజలను మోసం చేయడానికి కొత్త ప‌ద్ద‌తుల‌ను అవ‌లంభిస్తున్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది సైబర్ క్రైమ్స్ డబుల్ అయ్యాయి. ఫెస్టివల్ సేల్స్‌ సమయంలో హ్యాకర్లు ఎక్కువ యాక్టివ్ అవుతారు కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం ఇండియాలో 6 కొత్త డిజిటల్ స్కామ్స్‌ తెరపైకి వచ్చాయి. ఇవేంటి, వీటి నుంచి ఎలా జాగ్రత్త పడాలో తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో మీరు కూడా చూడండి.

ఆన్‌లైన్ షాపింగ్ స్కామ్స్‌

ఫెస్టివల్ సీజన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు అందిస్తామని చెప్పి మోసగాళ్లు బురిడి కొట్టిస్తారు. ఒరిజినల్ కంపెనీ వెబ్‌సైట్ లాగానే కనిపించే ఫేక్ వెబ్‌సైట్లు ప్రారంభించి, బ్యాంకు డీటైల్స్ దొంగిలిస్తారు. సోషల్ మీడియా, వాట్సాప్, SMSల ద్వారా మెసేజ్‌లు పంపి, ఆఫర్లు ఇస్తారు. ఆ ఆఫర్లకు టెంప్ట్ అయితే అంతే సంగతులు. అందుకే ఏదైనా వస్తువు ధర చాలా తక్కువగా ఉంటే, అది ఫేక్ అయి ఉండొచ్చని గమనించాలి. కొత్త వెబ్‌సైట్ చూస్తే అది నిజమైనదో కాదో చెక్ చేయాలి. అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదు. అఫీషియల్ పోర్టల్స్, యాప్స్ ద్వారానే ఆన్‌లైన్ షాపింగ్ చేయాలి.

ఫ్లిప్‌కార్ట్ ప్రైజ్ మనీ

మీరు ఫ్లిప్‌కార్ట్ పోటీలో గెలిచారు, మీకు గిఫ్ట్ కార్డ్ వచ్చింది.. అంటూ స్కామర్లు మెసేజ్‌లు పంపుతారు. వీటిలో కనిపించే లింక్ మీద క్లిక్ చేస్తే, ఫోన్‌ను హ్యాక్ చేస్తారు. అందుకే అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌ల్లో ఉండే లింక్స్‌పై క్లిక్ చేయకూడదు.

ఫేక్ బ్యాంకింగ్ రివార్డ్ అప్లికేషన్లు

మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోయిందని, రివార్డ్ పాయింట్లు తీసుకోవడానికి ఇదే చివరి రోజు అని స్కామర్లు మెసేజ్‌లు పంపిస్తూనే ఉంటారు. వీటికి భయపడి, వాళ్లు చెప్పినట్లు చేస్తే, ఫోన్‌లోకి వైరస్‌లు ప్రవేశపెడతారు. ఈ మెసేజ్‌లలో ఉండే లింక్‌పై క్లిక్ చేస్తే, ఒక ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. ఈ ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేస్తే, ఫోన్ హ్యాక్ అవుతుంది. అందుకే ఎప్పుడూ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ లాంటి అఫీషియల్ యాప్ స్టోర్స్ నుంచే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. బ్యాంక్ లేదా ఇతర సంస్థల నుంచి వచ్చినట్లు కనిపించే మెసేజ్‌లు వస్తే, నేరుగా ఆ సంస్థను సంప్రదించి డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదు, బ్యాంకింగ్ యాప్స్‌కు 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేసుకోవాలి.

ఫేక్ ఐఆర్‌సీటీసీ యాప్ మోసం

పండుగల సమయంలో చాలామంది సొంతూళ్లకు వెళ్తారు. ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా పెద్ద ఎత్తున ట్రైన్ టికెట్లు బుక్ అవుతుంటాయి. అయితే కేటుగాళ్లు ఐఆర్‌సీటీసీ యాప్‌ను పోలిన ఫేక్ యాప్స్‌ను క్రియేట్ చేసి, ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయమని చెబుతారు. ఈ యాప్స్‌లో వైరస్‌లు ఉంటాయి. ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తే, ఫోన్ హ్యాక్ అయిపోతుంది. యూజర్ పేరు, అడ్రస్, బ్యాంక్ అకౌంట్ డీటైల్స్, జీపిఎస్‌ లొకేషన్ అన్ని హ్యాకర్‌కు తెలిసిపోతాయి. ఈ స్కామ్‌ బారిన పడకుండా ఉండాలంటే ఐఆర్‌సీటీసీ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ లాంటి అఫీషియల్ యాప్ స్టోర్స్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి.

యూపీఐ-బేస్డ్ ఫెస్టివల్ స్కామ్స్

స్కామర్స్ పాపులర్ బ్రాండ్స్ చారిటీల యూపీఐ ఐడీలకు ఫేక్ యూపీఐ ఐడీ క్రియేట్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. ఉదాహరణకు “amazonpay@upi” ఫేక్ యూపీఐ ఐడీ సృష్టించి ట్రిక్ చేస్తున్నారు. డొనేషన్ రిక్వెస్ట్‌లు వచ్చినప్పుడు అవి నిజమైన ఓ కాదో చెక్ చేయాలి. డబ్బులు పంపేటప్పుడు ఒరిజినల్ యూపీఐ ఐడీకే పంపిస్తున్నామా అనేది నిర్ధారించుకోవాలి.

క్యూఆర్‌ కోడ్ ఫిషింగ్ (క్విషింగ్)

స్కామర్లు ఫేక్ క్యూఆర్‌ కోడ్స్ క్రియేట్ చేసే హానికరమైన వెబ్‌సైట్స్‌ విజిట్ చేసేలా, లేదంటే యాప్స్ డౌన్‌లోడ్ చేసేలా ట్రిక్ చేస్తారు. కాబట్టి కెమెరాతో తెలియని క్యూఆర్‌ కోడ్స్ స్కాన్ చేయకూడదు. స్కాన్ చేసిన వెంటనే ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేయమని అడిగినా, లేదంటే తెలియని వెబ్‌సైట్స్‌కి వెళ్లినా వెంటనే వాటిని క్లోజ్ చేయాలి.