అవయవదానం మరొకరి జీవితానికి ప్రాణం పోస్తుంది.. అవయవదానం చెయ్యాలని ప్రభుత్వాలు ప్రచారాలు సైతం నిర్వహిస్తున్నాయి. కాని అవయవదానంలో మహిళలే ముందు వరుసలో ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. 2023లో మొత్తం 16,542 అవయవ దానాలు జరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. బతికుండగానే 15,436 మంది అవయవదానానికి ముందుకు రాగా.. అందులో 9,784 మంది మహిళలు ఉన్నారు. 5,651 మంది పురుషులతో పాటు ఒక ట్రాన్స్‌జెండర్ అవయదానానికి ముందుకొచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
బతికున్న వ్యక్తులు సాధారణంగా ఒక మూత్రపిండం, కాలేయం, ఊపిరితిత్తుల్లో కొంత భాగాన్ని దానం చేస్తుంటారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆర్గాన్లు అవసరమైనప్పుడు ముందుకొస్తుంటారు. బ్రెయిన్ డెడ్ అయినవారి (జీవన్మృతులు) నుంచి మరికొన్ని ఇతర అవయవాలు, కణజాలాన్ని వారి కుటుంబ సభ్యుల అనుమతి మేరకు దానం చేయవచ్చు. 2023లో ఇలా బతికున్న వారి నుంచి చనిపోయిన వారి నుంచి తీసుకున్న అవయవాలతో 18,378 అవయవ మార్పిడిలు జరిగినట్లు కేంద్రం తెలిపింది. చనిపోయిన అవయవదాతల్లో 844 మంది పురుషులు ఉండగా.. 255 మంది స్త్రీలు ఉన్నారు.
అవయవాల వారీగా చూస్తే గతేడాది అత్యధికంగా 13,426 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. 4,491 కాలేయం, 221 గుండె సంబంధిత శస్త్ర చికిత్సలు జరిగినట్లు పేర్కొంది. మరణించిన వారి నుంచి సేకరించిన అవయవదానాల్లో తెలంగాణ (252) తొలి స్థానంలో ఉండగా.. తమిళనాడు, కర్ణాటక (178) తర్వాతి స్థానంలో నిలిచాయి. ఢిల్లీలో అత్యధికంగా 2,576 మందికి కిడ్నీ మార్పిడులు జరగగా.. తమిళనాడు (1633), మహారాష్ట్ర (1305) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అవయవదానంపై ఒకప్పటితో పోలిస్తే అవగాహన పెరుగుతున్నా.. ఇతర దేశాలతో పోలిస్తే ముందుకొస్తున్న వారి సంఖ్య ఇంకా తక్కువేనని చెప్పాలి. సగటున 10 లక్షల మందిలో ఒకరు కూడా ముందుకు రావడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. గతంలో ప్రధాని మోదీ సైతం తన ‘మన్‌కీ బాత్’లో అవయవదానం గురించి ప్రస్తావించారు. 18 ఏళ్లు దాటిన వారు ఒక కిడ్నీ, కాలేయంలోని కొంత భాగాన్ని దానం చేయొచ్చని జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ఎన్‌ఓటీటీఓ) పేర్కొంటోంది.