Tuesday, September 24, 2024
Homeఅంతర్జాతీయంఆ దేశంలో మ‌హిళ‌ల కంటే పిల్లుల‌కే స్వేచ్చ ఎక్కువ‌

ఆ దేశంలో మ‌హిళ‌ల కంటే పిల్లుల‌కే స్వేచ్చ ఎక్కువ‌

Date:

అఫ్గాన్‌లో పిల్లులు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నాయని, అమ్మాయిల కంటే ఉడుతలకే హక్కులు ఎక్కువగా ఉన్నాయని హాలీవుడ్‌ నటి, ఆస్కార్‌ అవార్డు గ్రహీత మెరిల్‌ స్ట్రీప్‌ ఐరాస వేదికగా స్పందించారు. ”అఫ్గాన్‌లో నేడు మహిళల కంటే ఆడ పిల్లులకే ఎక్కువ స్వేచ్ఛ ఉంది. అవి బయట కూర్చొని సూర్యరశ్మిని ఆస్వాదించవచ్చు. పార్కుల్లోకి ఉడుతలు స్వేచ్ఛగా ఎగురుతూ తిరగొచ్చు. అక్కడ అమ్మాయి కంటే ఓ ఉడుతకే హక్కులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడి పార్కుల్లో బాలికలు, మహిళలకు ప్రవేశాలను తాలిబన్లు నిలిపేశారు. ఓ పక్షి అక్కడ స్వేచ్ఛగా పాడగలదు. కానీ, మహిళలకు కనీసం ఆ స్వేచ్ఛ కూడా లేదు” అని మెరిల్‌ స్ట్రీప్‌ ఆవేదన వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లో ఐరాస సాధారణ సమావేశాల వేళ ఓ చర్చలో మాట్లాడిన ఆమె.. అంతర్జాతీయ సమాజం ఏకతాటిపైకి వస్తే అఫ్గాన్‌ మహిళలకు మళ్లీ స్వేచ్ఛావాయువులను అందించవచ్చన్నారు.

అమెరికా బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత తాలిబన్ల చేతుల్లోకి అఫ్గాన్‌ వెళ్లిపోయింది. ఆగస్టు 2021 నుంచి మొదలైన అఫ్గాన్‌ పాలనలో.. షరియా చట్టం పేరుతో మహిళలపై అనేక ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో బాలికలు చదువుకు దూరమయ్యారు. యూనివర్సిటీలతో పాటు ఉద్యోగాలకూ అనుమతించడం లేదు. కనీసం స్వేచ్ఛగా పాటలు పాడుకునే పరిస్థితి కూడా లేదు. కుటుంబ సభ్యులు మినహా ఇతర పురుషుల వైపు చూడటం, హిజాబ్‌ లేకుండా బయటకు వెళ్లడం, తమ గ్రంథాన్ని బహిరంగంగా పఠించడంపైనా నిషేధం విధించారు. ఇలా అనేక విధాలుగా మహిళలపై వివక్ష చూపుతున్న తాలిబన్లపై అంతర్జాతీయ సంఘాలు మండిపడుతున్నాయి.