Tuesday, September 24, 2024
Homeజాతీయంప‌రిశుభ్ర‌మైన ఆహారం కోసం ప్ర‌త్యేక చ‌ర్యలు

ప‌రిశుభ్ర‌మైన ఆహారం కోసం ప్ర‌త్యేక చ‌ర్యలు

Date:

హోటళ్లు, రెస్టారెంట్లకు వ‌చ్చే వినియోగ‌దారుల‌కు ప‌రిశుభ్ర‌మైన ఆహారాన్ని అందాల‌నే ల‌క్ష్యంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పని సమయంలో చెఫ్‌లు, వెయిటర్లు మాస్కులు, గ్లౌవ్స్‌ ధరించాలని వెల్లడించింది. ఆహారశాలల వద్ద సీసీటీవీ ఏర్పాటు తప్పనిసరి చేసింది. అంతేగాకుండా హోటళ్లతో సహా జ్యూస్‌ షాప్‌ల వద్ద వాటి నిర్వాహకులు, మేనేజర్లు తమ పేర్లు, చిరునామాలు ప్రదర్శించాలని పేర్కొంది. ఈ సేవల విషయంలో జవాబుదారీ తీసుకురావాలనే లక్ష్యంతోనే వీటిని తీసుకువచ్చింది. తినే పదార్థాల్లో ఉమ్మివేసినట్లు, మూత్రం కలిపినట్లు వార్తలు రావడంతో ఈ ఆదేశాలు ఇచ్చిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

లఖ్‌నవూలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ.. ”ఆహారపదార్థాల్లో మానవ వ్యర్థాలు రావడం అసహ్యకరం. అవి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఆ తరహా ప్రవర్తనకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని సూచించారు. రాష్ట్రంలోని సహారన్‌పుర్‌లోని ఒక హోటల్‌లో రోటీలు చేస్తుండగా.. ఒక యువకుడు వాటిపై ఉమ్మివేస్తున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ అయింది. ఘాజియాబాద్‌లోని ఒక విక్రేత జ్యూస్‌లో మూత్రం కలిపినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరహా ఘటనల్లో పలు అరెస్టులు చోటుచేసుకున్నాయి. ఈ వరుస పరిణామాలపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ”దాబాలు, రెస్టారంట్లు, ఇతర ఆహారశాలలను క్షుణ్నంగా పరిశీలించాలి. అలాగే అక్కడ పనిచేసే ఉద్యోగులను పోలీసులు వెరిఫై చేయాలి. ఆహార పదార్థాల స్వచ్ఛతను కాపాడేలా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్‌ యాక్ట్‌కు తగిన సవరణలు చేయాలి” అని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.