Sunday, December 22, 2024
Homeక్రైంజుట్టు కత్తిరించుకోవాలని చెప్పిన అధ్యాపకుడు

జుట్టు కత్తిరించుకోవాలని చెప్పిన అధ్యాపకుడు

Date:

విద్యార్ధి జుట్టు విపరీతంగా పెరగడంతో, జుట్టు కత్తిరించుకోవాలని తరగతి గదిలో అధ్యాపకుడు మందలించాడు. అందరి ముందు మందలించాడని అవమానంగా భావించిన ఆ విద్యార్ధి భవనం మీద నుంచి కిందికి దూకేశాడు. సిద్దిపేట జిల్లాలో ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్‌ మండలం చంద్లాపూర్‌కు చెందిన నక్కిరెడ్డి జ్ఞానేశ్వర్‌ రెడ్డి (19) ఘట్‌కేసర్‌ మండలం వెంకటాపూర్‌లోని అనురాగ్‌ యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ సీఎస్‌ఈ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. జ్ఞానేశ్వర్‌ రెడ్డి గత కొన్ని రోజులుగా తరగతులకు ఆలస్యంగా వస్తున్నాడు. అంతేకాకుండా మొదటి సెమిస్టర్‌ పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యాడు. నాలుగు రోజుల క్రితం సెమిస్టర్‌ ఫలితాలు విడుదలవగా ఈ విషయం వెల్లడైంది.

దీంతో గత మూడు రోజుల నుంచి అధ్యాపకుడు (డీన్‌) వీఎస్‌రావు విద్యార్థి జ్ఞానేశ్వర్‌ రెడ్డికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్ధిని కటింగ్‌ చేయించుకోవాలని సూచించారు. బుధవారం కూడా తరగతి గదిలో విద్యార్ధుల ముందు ఇదే విషయమై జ్ఞానేశ్వర్‌ రెడ్డిని అధ్యాపకుడు వీఎస్‌రావు మరోమారు మందలించారు. దీంతో తోటి విద్యార్థుల ముందు అధ్యాపకుడు మందలించాడని అవమానంగా భావించిన జ్ఞానేశ్వర్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం వర్సిటీ భవనం రెండో అంతస్తు నుంచి కిందికి దూకేశాడు. వెంటనే తోటి విద్యార్ధులు, అధ్యాపకులు యూనివర్సిటీలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు విద్యార్ధికి చికిత్స అందిస్తున్నారు. అధ్యాపకుడు అవమానించడం వల్లనే తాన సోదరుడు ఆత్మహత్యాయత్నం చేశానని విద్యార్థి జ్ఞానేశ్వర్‌ రెడ్డి సోదరుడు స్వాతిక్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై అధ్యాపకుడు వీఎస్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. జ్ఞానేశ్వర్‌రెడ్డి తరగతులకు సరిగా హాజరు కావడం లేదనీ, మొదటి సెమ్‌లో అన్నింటా ఫెయిలయ్యాడని, జుట్టు పెరిగినందున కటింగ్‌ చేయించుకోవాలని కౌన్సెలింగ్‌ మాత్రమే ఇచ్చానని చెప్పారు. ఇదే విషయాన్ని విద్యార్థి తండ్రికి కూడా ఫోన్‌ చేసి చెప్పినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.