Tuesday, September 24, 2024
Homeఆంధ్రప్రదేశ్నాలుగు రోజుల్లో 14ల‌క్ష‌ల ల‌డ్డూలు అమ్మ‌కం

నాలుగు రోజుల్లో 14ల‌క్ష‌ల ల‌డ్డూలు అమ్మ‌కం

Date:

తిరుమ‌ల తిరుప‌తి ల‌డ్డూను మహాప్ర‌సాదంగా భావిస్తారు. ఇటీవ‌ల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వు వినియోగం అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రజలు ఎంతో ఇష్టంగా తినే తిరుమల లడ్డూ చుట్టూ వివాదం నెలకొంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం లడ్డూ విక్రయాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని టీటీడీ అధికారులు తాజాగా స్పష్టం చేశారు. గడిచిన నాలుగు రోజుల్లో మొత్తం 14 లక్షల లడ్డూలు విక్రయించినట్లు వెల్లడించారు. ఈ నెల 19న మొత్తం 3.59 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయి. సెప్టెంబర్‌ 20వ తేదీన 3.17 లక్షలు, సెప్టెంబర్‌ 21న 3.67 లక్షలు, సెప్టెంబర్‌ 22న 3.60 లక్షల లడ్డూలు అమ్ముడైనట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. సగటున రోజుకు 3.50 లక్షల లడ్డూలు విక్రయించామని పేర్కొన్నారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిశాయనే వార్తలు ఇటీవల పెద్ద దుమారం రేపాయి. ఈ క్రమంలో జరిగిన మహా పాపానికి పరిహారంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ.. ఆలయంలోని అన్ని విభాగాల్లో ప్రోక్షణ కార్యక్రమాలు చేశామని తెలిపారు. ప్రసాదాల తయారీ కేంద్రాల్లోనూ ప్రోక్షణ చేస్తున్నామని అన్నారు. తెలిసీ తెలియక జరిగిన దోషాలు శాంతి హోమం, ప్రోక్షణతో తొలగుతాయని అన్నారు. చివరగా పూర్ణాహుతి కార్యక్రమంతో అన్ని దోషాలు తొలగిపోతాయని చెప్పారు.