Sunday, September 22, 2024
Homeతెలంగాణజమ్మూకశ్మీర్‌లో త్రివర్ణ పతకమే రెపరెపలాడుతుంది

జమ్మూకశ్మీర్‌లో త్రివర్ణ పతకమే రెపరెపలాడుతుంది

Date:

జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాఔరీ జిల్లా నౌషేరాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగ అధికరణం 370 రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కానీ, అధికారం వచ్చాక ఆ ఆర్టికల్‌ను పునరుద్ధరిస్తామని ఫరూక్‌ అబ్దుల్లా చెబుతున్నారు. ఏ శక్తీ దాన్ని తిరిగి తీసుకురాలేదు. ఇప్పుడు ఈ ప్రాంతంలో బంకర్ల అవసరం లేదు. ఎందుకంటే.. కాల్పులు జరిపే సాహసం ఎవరూ చేయలేరు. జమ్మూకశ్మీర్‌లో కేవలం మన దేశ త్రివర్ణ పతకం మాత్రమే రెపరెపలాడుతుంది” అని అమిత్‌ షా పేర్కొన్నారు.

కొందరు పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ, ఉగ్రవాదం అంతమయ్యే వరకు వారితో ఎలాంటి చర్చలు జరిపేది లేదు. దేశంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను జైలు నుంచి విడుదల చేయాలని వారు (కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ) కోరుకుంటున్నారు. కానీ, మోదీ సర్కార్‌ అలా ఎన్నటికీ చేయదు. భారత ప్రజలపై రాళ్లు రువ్విన వారికి కారాగారం నుంచి విముక్తి కల్పించేది లేదు” అని షా మరోసారి స్పష్టం చేశారు. కాగా.. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలు (సెప్టెంబరు 18న తొలి విడత, సెప్టెంబరు 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత)జరుగుతున్నాయి.