పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఏ వయసువారినీ వదిలిపెట్టకుండా లైంగిక దాడులు చేస్తూ.. జుగుప్స కలిగేలా చేస్తున్నారు. అలాంటి ఘటనే.. మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. బండమాదారం గ్రామంలో ఓ వృద్ధురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బండమాదారంలోని క్వార్టర్స్‌లో 90 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు నివసిస్తోంది. అయితే.. కామంతో కళ్లు మాత్రమే కాదు బుద్ధి కూడా బ్రష్టు పట్టి పోయిన.. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు.. ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిపై లైంగిక దాడికి తెగబడ్డారు. అయితే.. అందులో ఒకరిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. స్థానికులకు దొరికిన వ్యక్తి.. కరెంట్ లైన్ వద్ద సహాయకుడిగా పనిచేసే వెంకట్ రావు(36)గా గుర్తించగా.. మరో ఇద్దరు యువకులు పారిపోయినట్టు తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలపటంతో.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని.. పరీక్షల నిమిత్తం వృద్ధురాలిను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. విచారణ చేస్తున్నారు. స్థానికులు పట్టుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవటంతో పాటు.. పారిపోయిన మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.