Sunday, December 22, 2024
Homeక్రైంపని ఒత్తిడితోనే సిఏ యువతి మృతి..

పని ఒత్తిడితోనే సిఏ యువతి మృతి..

Date:

కార్పోరేట్ కంపెనీలలో రేయింబవళ్లు పనిచేస్తూ, పని ఒత్తిడి భరించలేక చాలా మంది ఉద్యోగులు.. ఉద్యోగానికి రాజీనామా చేయడమో లేక రాత్రింబవళ్లు నిద్ర, ఆహారం లేకుండా పనిచేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ 26 ఏళ్ల సీఏ ఉద్యోగిని పని ఒత్తిడికి తాళలేక చనిపోవడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఆమె చనిపోయిన తర్వాత కనీసం చూడడానికి కూడా సదరు కంపెనీ నుంచి ఒక్క ఉద్యోగి కూడా రాకపోవడం గమనార్హం. ఈ ఘటన తీవ్ర దుమారానికి కారణం కావడంతో స్పందించిన కేంద్రం సీరియస్ అయింది.

ఎర్నెస్ట్ అండ్‌ యంగ్‌ ఇండియా పూణే బ్రాంచ్‌లో పనిచేసే కేరళకు చెందిన యువ ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ పెరియాలి ఇటీవలె మృతి చెందారు. తన కుమార్తె.. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీలో పని ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యానికి గురై చనిపోయిందని ఆమె తల్లి అనితా అగస్టీన్ ఆరోపించారు. తన కుమార్తె చాలా రోజులు ఆఫీస్‌లోనే విపరీతంగా పని చేసేదని.. కొన్నిసార్లు నిద్ర పోయేందుకు టైం సరిపోయేది కాదని వాపోయారు. అర్ధరాత్రి వరకు, వీకెండ్స్ కూడా అన్నా సెబాస్టియన్ ఆఫీస్‌లోనే ఉండి పనిచేసేదని తెలిపారు. అదనపు భారం వేయడంతో.. పూర్తిగా అలసిపోయి ఇంటికి వచ్చి కనీసం దుస్తులు కూడా మార్చుకోకుండానే పడుకునేందని వెల్లడించారు. ఎర్నెస్ట్ అండ్‌ యంగ్‌ ఇండియా కంపెనీలో పని ఒత్తిడి కారణంగానే తన కుమార్తె చనిపోవడానికి కారణం అని అనిత తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ ఘటన సంచలనంగా మారడంతో కేంద్రం స్పందించింది. అన్నా సెబాస్టియన్‌ మరణాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర కార్మిక శాఖ.. దీనిపై దర్యాప్తు చేపడుతుందని కేంద్ర సహాయమంత్రి శోభా వెల్లడించారు.