Thursday, September 19, 2024
Homeజాతీయంజ‌మిలి విధానంతో ప్ర‌జాస్వామ్యం మ‌రింత శ‌క్తివంతం

జ‌మిలి విధానంతో ప్ర‌జాస్వామ్యం మ‌రింత శ‌క్తివంతం

Date:

దేశంలో ప్ర‌జాస్వామ్యం మ‌రింత శ‌క్తిమంతంగా, భాగ‌స్వామ్య‌యుతంగా మార్చే కీల‌క ముంద‌డుగు జ‌మిలి విధాన‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి మోడీ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. దేశంలో జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రూపొందించిన నివేదికకు కేంద్ర కేబినెట్‌ పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న కమిటీ సిఫార్సులను ఆమోదించింది. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ఉన్నతస్థాయి కమిటీకి నాయకత్వం వహించినందుకు, నివేదిక రూపకల్పనలో భాగంగా అన్ని వర్గాలతో విస్తృత చర్చలు జరిపినందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అభినందనలు తెలిపారు.

‘ఒక దేశం- ఒకే ఎన్నికలు’ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుందని, తద్వారా వేగవంతమైన ఆర్థికాభివృద్ధి సాధ్యమని కమిటీ తన నివేదికలో పేర్కొంది. పదేపదే ఎన్నికల వల్ల వలస కార్మికులు పలుమార్లు ఓటేయడం కోసం సెలవులపై తమ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని.. దీంతో ఉత్పత్తిలో అంతరాయం కలుగుతోందని వెల్లడించింది. దీన్ని నివారించాలంటే జమిలి ఎన్నికలే ఏకైక పరిష్కారమని పేర్కొంది. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 18 రాజ్యాంగ సవరణలను ప్యానల్‌ సిఫార్సు చేసింది.