Saturday, January 4, 2025
Homeజాతీయంకోల్‌క‌తా కేసులో కీలక ఆధారాలు నాశనం..

కోల్‌క‌తా కేసులో కీలక ఆధారాలు నాశనం..

Date:

పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య కేసును సీబీఐ ద‌ర్యాప్తు చేప‌ట్టింది. సీబీఐ చేపట్టిన ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అత్యాచార ఘటనలో పోలీసుల తీరుపై దర్యాప్తు సంస్థ అనుమానం వ్యక్తంచేస్తోంది. ఈ ఘటన తర్వాత నిందితుడికి సంబంధించిన వస్తువులను ఆలస్యంగా స్వాధీనం చేసుకోవడమే అందుకు కారణం. తొలుత ఈ కేసును బెంగాల్‌ పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఆ విచారణపై అనుమానాలు వ్యక్తమవడంతో కోల్‌కతా హైకోర్టు ఆ కేసును సీబీఐకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. వైద్యురాలిపై అఘాయిత్యం జరిగిన రెండు రోజుల తర్వాత నిందితుడు సంజయ్‌రాయ్‌ దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఒకవేళ వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని ఉంటే సాక్ష్యాధారాలు దొరికే అవకాశం ఉండేదని తెలిపింది. అప్పుడు కేసులో కొంతవరకు పురోగతి కనిపించేదని పేర్కొంది.

తొలుత బెంగాల్‌ పోలీసులు కీలక ఆధారాలను నాశనం చేసే ఉద్దేశంతోనే విచారణ చేపట్టారని సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. కాగా.. కోల్‌కతా ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాలలో జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారం యావత్‌ దేశాన్ని దిగ్ర్భాంతికి గురిచేస్తోంది. ఈ ఘటనను నిరసిస్తూ వైద్యులు నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే.. ఈ కేసు విచారణలో భాగంగా వైద్యకళాశాల మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ మోసపూరిత సమాధానాలు ఇస్తున్నారని సీబీఐ పేర్కొంది. ఆయనకు పాలీగ్రాఫ్‌ టెస్టు, వాయిస్‌ అనాలిసిన్‌ నిర్వహించగా.. కీలకమైన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ అధికారులు చెబుతున్నారు. ఈక్రమంలోనే నిరసనలు తెలుపుతున్న వైద్యులు వినిపించిన ఐదు డిమాండ్లలో సీఎం మమతా బెనర్జీ మూడింటిని అంగీకరించారు. పలు డిమాండ్లను వినిపించేందుకు మరోసారి సీఎంతో సమావేశం ఏర్పాటుచేయాలని కోరుతూ చీఫ్‌ సెక్రటరీ మనోజ్‌ పంత్‌కు వైద్యులు మెయిల్‌ పంపించారు. అప్పటివరకు తమ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.